రాజస్థాన్ లో అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. రాజస్థాన్ లో లక్షల కోట్ల విలువైన భారీ లిథియం నిల్వలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైనింగ్ అధికారులు వెల్లడించారు. ఇక్కడ లభించే లిథియం ఖనిజ పరిమాణం మన దేశ అవసరాలను 80 శాతం తీర్చగలరని అధికారులు చెబుతున్నారు. దీంతో భారత్ దశ తిరిగినట్టే అంటున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని డేగానాలోని రెన్వాత్ కొండ ప్రాంతంలో నిధి నిక్షేపాలు ఉన్నట్లు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్థాన్లో అత్యంత అధికంగా లిథియం నిల్వలు ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశం లిథియం ను దిగుమతి చేసుకుంటుంది. తాజా లిథియం నిల్వల గుర్తింపుతో భారతదేశంలో ఉన్న డిమాండ్ గణనీయంగా తీరుతుందని చెబుతున్నారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కన్నా అత్యధికంగా రాజస్థాన్ లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్‌లో లిథియం రిజర్వ్స్ ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. గతంలో కర్నాటకలో స్వల్ప స్థాయిలో లిథియం ఖనిజ నిక్షేపాలను గుర్తించారు. అయితే జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లలో భారీ స్థాయిలో ఆ ఖనిజాలను గుర్తించడం విశేషం.విద్యుత్ వాహనాల్లోని బ్యాటరీల్లో లిథియమే ప్రధానం. అత్యంత అరుదుగా ఉండే ఈ ఖనిజం కోసం ప్రభుత్వం చాన్నాళ్లుగా అన్వేషిస్తోంది. మరోవైపు లిథియం ఐయాన్ బ్యాటరీ అభివృద్ధి, ఉత్పత్తి కోసం జీఎస్ఐతో పాటు మరో మూడు కంపెనీలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. లిథియం ప్రపంచవ్యాప్తంగా తేలికైన, ఒక మృదువైన లోహం. ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఉపయోగించే బ్యాటరీలలో కీలకంగా ఉపయోగపడుతుంది. లాప్ ట్యాప్ లు, ఫోన్లు, బ్యాటరీల తయారీలో లిథియం ఉపయోగపడుతుంది.
ప్రపంచంలోని లిథియం ఉత్పత్తిలో 47 శాతం ఆస్ట్రేలియాలో, 30 శాతం చిలీలో, 15 శాతం చైనాలో జరుగుతుంది. లిథియం ప్రోసెసింగ్ లో 58 శాతం చైనాలో, 10తో అర్జెంటీనాలో 29% చిలీలో జరుగుతుంది. ఇప్పటివరకు భారతదేశం లిథియం కోసం ప్రధానంగా చైనా పై ఆధారపడుతుంది. తాజాగా రాజస్థాన్లో భారీగా లిథియం నిల్వలు బయటపడడంతో చైనా గుత్తాధిపత్యానికి చెక్ పడుతుందని భావించొచ్చు.
తాజాగా లిథియం నిక్షేపాలు రాజస్థాన్ లో భారీగా ఉన్నాయని గుర్తించడంతో భారతదేశం విదేశాలపై ఆధారపడటం తగ్గించగలదని, మేకిన్ ఇండియా చొరవ కూడా అందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పరిణామం భారతదేశం తన దేశ అవసరాలను తీర్చడానికి మాత్రమే కాకుండా,ఇతర దేశాలకు లిథియం సరఫరా చేయడానికి కూడా దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
More Stories
జౌళి ఎగుమతుల్ని రూ.9 లక్షల కోట్లకు పెంచాలి
జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వంకు అప్పగింత
కేజ్రీవాల్ అధికారిక నివాసం `శీష్మహల్’ పై సివిసి దర్యాప్తు