బీజేపీ నేత‌ విష్ణు కుమార్ రాజుకు షోకాజ్ నోటీసు

బీజేపీ మాజీ ఎల్యేల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుకు బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎందుకు తప్పించకూడదంటూ షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇవాళ సాయంత్రంలోగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

పొత్తులపై మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడారనే అభియోగంపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. పొత్తులపై వివిధ సందర్భాల్లో విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లని బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. బీజేపీ ఢిల్లీ పెద్దల సూచనలతో బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

విష్ణుకుమార్ రాజు మరోసారి ఏపీలో జనసేన, టీడీపీతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి టీడీపీలో చేరే సమయంలో గుంటూరు వెళ్లి ఆయన్ను కలిసారు. పార్టీని వీడిన వ్యక్తి వద్దకు వెళ్లి కలవటం తో బీజేపీ చర్చకు దారి తీసింది.
 
విష్ణుకుమార్ రాజు కొంత కాలంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే వాదన ఉంది. టీడీపీలో అధికారికంగా చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల పైన వివరణ కోరినట్లు సమాచారం.