తీరంవైపు దూసుకొస్తున్న ‘మోచా’ తుఫాన్‌

దక్షిణ భారతదేశంలోని తూర్పుతీర రాష్ట్రాలకు మోచా తుఫాను ముప్పు పొంచి ఉన్నది. బంగళాఖాతంలో తుఫాను ఏర్పడి తమిళనాడు రాజధాని చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, అది సోమవారం వరకు వాయుగుండంగా మారుతుందని తెలిపింది.

దానివల్ల ద్రోణి, ఉపరితల ఆవర్తనంతోపాటు బంగాళాఖాతంలో ‘మోచా’ తుఫాన్‌ ఏర్పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. వాటి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు ఒడిశాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఓ వైపు మోచా తుఫాన్‌ బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాలుస్తుంటే.. మరోవైపు 2023లో ఏర్పడిన ఈ తొలి తుఫాన్‌కు ఆ పేరెలా వచ్చిందని చర్చ జరుగుతున్నది. WMO/ESCAP సభ్యదేశాలు పెట్టుకున్న నామీకరణ పద్ధతి ప్రకారం ప్రతి ఏటా తుఫాన్‌లకు ఒక్కో దేశం పేరును ఖరారు చేస్తాయి.

తాజా తుఫాన్‌కు ఈ మోచా తుఫాన్‌ అనే పేరును యెమెన్‌ దేశం ఖరారు చేసింది. మోచా అంటే చాక్‌లెట్‌ ఫ్లేవర్‌తో ఉండే ఒక రకం కాఫీ పానీయం. అదేవిధంగా మోఖా అనేది కూడా యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర నగరం. ఈ మోఖాను కూడా మోచా అనే స్పెల్లింగ్‌తో రాయవచ్చు.

తెలంగాణలో భారీ వర్షాలు

కాగా, ఇప్పటీకే అకాలవర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం సాయంత్రం హెచ్చరించింది. హైదరాబాద్‌ సహా ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాల కంటే ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం భారీ వర్షం పడొచ్చని పేర్కొంటూ.. ఎల్లో అలెర్ట్(6.4 నుంచి 11.5 సెంమీ.ల వాన పడే అవకాశం) జారీ చేశారు.