రామప్ప ఆలయ అభివృద్ధికి రూ. 61 కోట్లు

కాకతీయుల కళాతృష్ణకు కలికితురాయిగా నిలిచి, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయ సుందరీకరణ, పునరుద్దరణ పనుల్లో కేంద్ర, రాష్ట్ర పురావస్తు,పర్యాటక శాఖలు నిమగ్నమయ్యాయి. మరో వేయి సంవత్సరాల పాటు ఆలయాన్ని భద్రపరిచి భావితరాలకు అందించేందుకు పురావస్తు శాఖ పనుల్లో నిమగనమైంది.

రామప్ప ఆలయ సుందరీకరణ,మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రసాద్‌ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 61 కోట్ల 99 లక్షల మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి డీపీఆర్‌ లను రూపొందించి కేంద్ర పురావస్తు శాఖ పనులు ప్రారంభించింది.

ఈ పనుల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌, యాంఫీథియేటర్‌, ఫౌంటేన్‌ నిర్మాణం, కంపౌండ్‌ వాల్‌, శిల్పాలకోసం పీఠాలు, శిల్పాల నకళ్లు, కాకతీయ శైలిలో ముఖ ద్వార నిర్మాణం తదితర పనులు కొనసాగుతున్నాయి. అలాగే 3డి ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ సీసీటివీ నిఘా వ్యవస్థలు, జాతీయ రహదారి మార్గాల అనుసంధానం తదితరపనులు నిర్మాణంలో ఉన్నాయి.

వీటితో పాటుగా రామప్ప చెరువు సుందరీకరణ కు పర్యాటక శాఖ నిధులు మంజూరు చేయడంతో పాటుగా పర్యాటకులకోసం బోటింగ్‌, స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. రామప్పఆలయం సుందరీకరణతో పాటుగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే వివిధ ప్రాంతాల నుంచి టూరిజం ప్రత్యేక ప్యాకేజీలో ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యునెస్కో గుర్తింపు లభించగానే పర్యాటకుల తాకిడి పెరగడంతో వారికి తగ్గట్టుగా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు కేంద్ర పర్యాటక శాఖ నిమగ్నమైంది.