రాజౌరి బేస్‌ కేంప్‌ సందర్శించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

రాజౌరిలోని కంది అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో భాగంగా శుక్రవారం తీవ్రవాదులు పేలుడు పదార్ధాలు పేల్చడంతో ఐదుగురు సైనికులు మరణించిన నేపథ్యంలో రాజౌరి బేస్‌ కేంప్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం సందర్శించారు. జవాన్లు చేసిన త్యాగాలను దేశం ఎనుటికీ మరవబోదని స్పష్టం చేశారు.
 
రాజౌరి జిల్లాలో భద్రతా పరిస్థితులను తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఆయనకు లెప్టినెంట్‌ గవరుర మనోజ్‌ సిన్హా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండేలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడనుండి రాజౌరి వెళ్ళిన రాజ్‌నాథ్‌ బేస్‌ కేంప్‌లో సైనికులతో మాట్లాడారు.  ఈ ప్రాంతంలో  అక్టోబర్, 2021 నుండి ఉగ్రవాదులు జరిపిన ఎనిమిది దాడులలో 26 మంది సైనికులతో సహా 35 మందిని హతమార్చారు.
 
దేశానికి సేవలందించే క్రమంలో అత్యున్నత త్యాగాలు చేసిన సైనికులకు నివాళి అర్పించేందుకే తానిక్కడకు వచ్చినట్లు సింగ్‌ ట్వీట్‌ చేశారు. కండి అటవీప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్స్ గురించి అధికారులు వివరించిన తర్వాత ఆ ప్రాంతంలోని భద్రతాపరమైన అంశాల గురించి అత్యున్నతస్థాయి సమావేశంలో రక్షణమంత్రి సమీక్షించారు.
 
ఏప్రిల్ 20న సైనిక వాహనంను పేల్చి ఐదుగురు జవాన్లను ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలగురించి ప్రశ్నించేందుకు 250 మందిని పైగా సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉగ్రవాదులకు సహకారం అందించిన ఆరుగురిని అరెస్ట్ చేశారు.  కాగా కంది అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తాజా కాల్పుల్లో ఒక తీవ్రవాది మరణించగా, మరొకరు గాయపడ్డారని సైన్యం ప్రకటించింది.  ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుండి ఎకె-56 రైఫిల్‌ను, నాలుగు మేగజైన్లను, ఒక 9ఎంఎం పిస్టల్‌ను మూడు గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.