నీరజ్ చోప్రాకు డైమండ్ లీగ్ టైటిల్

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదిక మీద సత్తా చాటాడు దోహా వేదికగా శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ముగిసిన దోహా డైమండ్ లీగ్ -2023లో టైటిల్ కొట్టాడు.  గత డైమండ్ లీగ్ లో విజేతగా నిలిచిన నీరజ్ తొలి అంచె పోటీలలో టైటిల్ నెగ్గాడు.
శుక్రవారం రాత్రి నీరజ్ చోప్రా ఫస్ట్ అటెంప్ట్ లోనే 88.67 మీటర్ల దూరం విసిరి తన విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. తన సమీప ప్రత్యర్థి జాకబ్ వాద్లిచ్ కూడా నీరజ్ కు దగ్గరగా వచ్చాడు.  వాద్లిచ్ 88.63 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. ఫస్ట్ త్రో లోనే 88.67 మీటర్ల దూరం విసిరిన నీరజ్ తర్వాత మాత్రం ఆ దూరాన్ని దాటలేకపోయాడు. ఈ సీజన్ లో ‘టార్గెట్ 90’గా పెట్టుకున్న ఈ గోల్డెన్ బాయ్.. దోహాలో కూడా తృటిలో దానిని మిస్ అయ్యాడు.
 
ఈ సీజన్‌లో స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ చోప్రా బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ కావడంతో అందరిచూపూ అతడిపైనే నెలకొంది. ఫిట్‌నెస్‌ లేమి కారణంగా గతేడాది దోహా ఈవెంట్‌కు దూరమైనా.. జ్యూరిచ్‌లో జరిగిన లెగ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉన్నానని చోప్రా చెప్పాడు.