భారత్‌-చైనా సరిహద్దు పొడవునా సాధారణ పరిస్థితి

భారత్‌-చైనా సరిహద్దు పొడవునా పరిస్థితి సాధారణంగా స్థిరంగానే వుంటుందని చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ తెలిపారు. చరిత్ర నుండి ఇరు పక్షాలు గుణపాఠాలు నేర్చుకోవాలంటూ భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చర్చల సందర్భంగా పేర్కొన్నారు. ఇరువురు మంత్రులు జరిపిన చర్చలపై శుక్రవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది.

సాధారణంగా సరిహద్దుల వద్ద పరిస్థితులు స్థిరంగానే వుంటాయని అయితే, ఇరు దేశాల నేతల మధ్య కుదిరిన కీలకమైన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడాన్ని ఇరు పక్షాలు కొనసాగించాలని కిన్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను సంఘటితం చేస్తూ, సంబంధిత ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌కు కచ్చితంగా కట్టుబడి వుంటూ, సరిహద్దుల వద్ద పరిస్థితులను మరింత సాఫీగా వుండేందుకు చర్యలు తీసుకోవాలని, సరిహద్దు ఏరియాలో నిలకడగా శాంతి భద్రతలు కొనసాగేలా చూడాలని కోరారు.

వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథం నుండి ద్వైపాక్షిక సంబంధాలను చూడాలని కోరారు సామరస్య సహజీవనం పంథాను అనుసరించాలని సూచించారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య శాంతియుత అభివృద్ధి, సాధారణ పునరుజ్జీవనం వుండాలని అభిలాష వ్యక్తం చేశారు. అప్పుడే ప్రపంచ శాంతి, అభివృద్ధిలో స్థిరత్వం, సానుకూల శక్తిని చొప్పించగలుగుతామని చెప్పారు.

కాగా, ద్వైపాక్షిక సంబంధాలపై కిన్‌ గాంగ్‌తో సవివరమైన చర్చలు జరిపామని జై శంకర్‌ తెలిపారు. అపరిష్కృత సమస్యల పరిష్కారంపై దృష్టి కొనసాగించాలని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు హామీ కల్పించాలని చెప్పారు. గోవాలోని బెనాలిమ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇక్కడకు వచ్చిన కిన్‌ గాంగ్‌, జైశంకర్‌తో భేటీ అయ్యారు.

సరిహద్దు వద్ద పరిస్థితి సాధారణ నిర్వహణ దిశగా సాగుతోందని కిన్‌, ఇతర చైనా అధికారులు పేర్కొన్నారు. భారత్‌ కూడా ఈ అంశానికి సముచితమైన స్థానం ఇవ్వాలని కోరారు. అయితే చైనాతో సంబంధాలు ఇంకా అసాధారణంగానే వున్నాయని భారత అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు.