ఆన్‌లైన్‌లో మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ వెరిఫికేషన్‌

దేశ పౌరులు తమ ఆధార్‌కార్డులను ఆన్‌లైన్‌లో అప్డేట్‌ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉయుడై) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. UIDAI వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ రెండింటిలోనూ పౌరులు తమ ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్ నంబర్‌లను, ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించుకునే అవకాశం కల్పించింది.

తాము తమ ఆధార్‌ కార్డుతో ఏ మొబైల్‌ నంబర్‌ను లింక్‌ చేశామో, ఏ ఈ-మెయిల్‌ ఐడీని లింక్‌ చేశామో గుర్తు లేదని పౌరులు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఉయుడై తెలిపింది. ఈ విధంగా సరిచూసుకోవచ్చు:

1) అధికారిక వెబ్‌సైట్‌లో లేదా mAadhaar యాప్ ద్వారా ‘వెరిఫై ఈ-మెయిల్/మొబైల్ నంబర్’ ఫీచర్‌లోకి వెళ్లాలి.

2) ఈ ఫీచర్ అతని/ఆమెకు గుర్తున్న ఈ-మెయిల్/మొబైల్ నంబర్ సంబంధిత ఆధార్‌కు లింక్‌ చేసి ఉందా.. లేదా..? అనే విషయాన్ని ధృవీకరిస్తుంది.

3) పౌరులు నిర్దిష్ట మొబైల్ నంబర్‌ను లింక్ చేయని పక్షంలో వారు కోరుకుంటే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి అవసరమైన స్టెప్స్‌ను సూచిస్తుంది.

4) మొబైల్ నంబర్ ఇప్పటికే ధృవీకరించబడినట్లయితే సంబంధిత పౌరుడికి ‘మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది’ అనే సందేశం కనిపిస్తుంది.

5) పౌరులకు ఎన్‌రోల్‌మెంట్ సమయంలో వారు ఇచ్చిన మొబైల్ నంబర్ గుర్తులేకపోతే మై ఆధార్‌ పోర్టల్ లేదా mAadhaar యాప్‌లో వెరిఫై ఆధార్ ఫీచర్‌లో మొబైల్‌ నంబర్‌ చివరి మూడు అంకెలను ఎంటర్‌ చేసి తనిఖీ చేయవచ్చు. అయితే ఈ-మెయిల్ లేదా మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలంటే మాత్రం పౌరులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి.