కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో  ఎడ‌తెరిపిలేని హిమ‌పాతం కురుస్తోంది. దాంతో అధికారులు ఆరెంజ్ అల‌ర్ట్ ని ప్ర‌క‌టించారు. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుంది. దీనికి తోడు కొండ చరియలు కూడా విరిగి పడుతున్నాయి. ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. 

ఉత్తర కాశీలోని రోడ్లను మంచు కప్పేసింది. పౌడీలో,తెహ్రీలో, చమోలీలో, డెహ్రాడూన్ లో, బాగే షేర్ లో, చంపావత్, ఆల్మోరా, నైనిటాన్, హరిద్వార్ ప్రాంతాలు అసలు ఏమీ కనపడటం లేదు. కాశీ, అలకనంద, భగీరథీ, మందాకిని, గంగా నదులు గడ్డకట్టాయి. గంగోత్రి, భద్రీనాథ్, కేదార్ నాథ్, యమునోత్రి, చార్ ధామ్ యాత్రల మార్గాలు అన్ని మూసుకుపోయాయి.

భారీగా మంచు తుఫాను కురుస్తుండటంతో..కొంతమంది యాత్రికులు మంచులో కూరుకుపోయారు. రెస్క్యూ టీం మంచులో కూరుకుపోయిన యాత్రికులను రక్షించారు. రిషికేష్‌లో యాత్రికుల రిజిస్ట్రేషన్‌ ను తాత్కాలికంగా నిలిపివేశారు.  వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఎక్కువమంది వయస్సు మీద పడినవారే కావడంతో కొందరికి ఊపరి అందక ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో కేదార్‌నాథ్‌ను నిలిపివేశారు. అక్కడి నుంచి భక్తులు వీలైనంత తర్వగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు హిమపాతం కొనసాగే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు.

ఆలయ పరిసరాల్లో అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.  యాత్రికులు తమ బస ప్రాంతానికే పరిమితమయ్యారు. హిమపాతం కారణంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని అధికారులు చెప్పారు. దీంతో వయసు పైబడిన యాత్రికులు కొందరు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా చిక్కుకున్నట్లు   తెలుస్తోంది. అయితే, ఆలయ పరిసరాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో ఆలయ పరిసరాల్లో క్షణాల్లో వాతావరణం మారిపోతోంది.