అప్పుల ఊబిలో కూరుకుపోయిన అమెరికా

అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణ చెల్లింపులు చేయలేమని చేతులు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని రుణాలు చేసేందుకు అనుమతిస్తే మినహా ఇప్పటికే తీసుకున్న రుణాలను చెల్లించే పరిస్థితి లేదని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ కాంగ్రెస్‌లో ప్రకటించారు.
 
 ‘దేశం రుణాలు తీసుకునే అధికారాన్ని చట్టసభ సభ్యులు పెంచకపోయినా, ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదాన్ని నివారించకపోయినా, జూన్‌ 1 నాటికి అమెరికా రుణాలు చెల్లించడం విఫలం అవడం ఖాయం. దీనిని నివారించలేం’ అని జానెట్‌ యెలెన్‌ తెలిపారు. ఈ మేరకు ప్రతినిధుల సభ, సెనెట్‌ నేతలకు కూడా యెలెన్‌ లేఖ రాశారు.
 
అమెరికా చట్టబద్ధంగా రుణాలు తీసుకునే అధికారంపై గల 31.4 ట్రిలియన్ల డాలర్ల పరిమితిని పెంచేవిధంగా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అమెరికా వద్ద కచ్చితంగా నగదు ఎప్పుడైపోతుందనే తేది ఊహించడం సాధ్యం కాదన్నారు.
 
“రుణ పరిమితి సంక్షోభంపై గతంలోనూ మనం పాఠాలు నేర్చుకున్నాం. రుణ పరిమితిని పెంచడానికి లేదా సస్పెండ్‌ చేయడానికి చివరి నిముషం వరకు వేచి వుండడం వల్ల వ్యాపార, వినియోగదారుల విశ్వాసానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని మనం తెలుసుకున్నాం” అని హెచ్చరించారు. దీనివల్ల అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
 
 జూన్‌ మొదటికల్లా అమెరికా వద్ద నగదు నిల్వలు తరిగిపోయే ప్రమాదముందని కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం (సిబిఓ) కూడా సోమవారం హెచ్చరించింది. ఆర్థిక శాఖ తీసుకున్న అసాధారణ చర్యల ఫలితం కూడా మనం ముందు అంచనా వేసిన దానికన్నా చాలా త్వరగానే ముగుస్తోందని తెలిపింది. ఫెడరల్‌ ప్రభుత్వ డిఫాల్ట్‌ను నివారించేందుకు అసాధారణ చర్యలు తీసుకోవడం ఆరంభించామంటూ జనవరిలో యెలెన్‌ కాంగ్రెస్‌ నేతలకు లేఖ రాశారు.