కాళీ మాత ట్వీట్‍పై ఉక్రెయిన్ క్షమాపణ

కాళీ మాతను పోలి ఉన్న ఓ అభ్యంతరకర చిత్రాన్ని ట్వీట్ చేసిన ఉక్రెయిన్ రక్షణ శాఖ తన తప్పును గుర్తించింది. సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్రమైన విమర్శలు, వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గింది. దీంతో క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఎమిన్ జపరోవా మంగళవారం ట్వీట్ చేశారు. ఈ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
 
భారతీయ సంస్కృతిని తమ దేశం ఎంతో గౌరవిస్తుందని ఎమిన్ జపరోవా పేర్కొన్నారు. “హిందూ దేవత కాళీని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించినందుకు ఉక్రెయిన్ రక్షణ శాఖ విచారం వ్యక్తం చేస్తోంది. ఎంతో ప్రత్యేకమైన భారత సంస్కృతి పట్ల ఉక్రెయిన్‍కు, దాని ప్రజలకు అపారమైన గౌరవం ఉంది. మీ మద్దతుకు ఎంతో అభినందనలు తెలుపుతున్నాం. ఆ చిత్రీకరణను ఇప్పటికే తొలగించాం. పరస్పర గౌరవం, స్నేహంతో మున్ముందు సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిశ్చయంతో ఉన్నాం” అంటూ  జపరోవా ట్వీట్ చేశారు.
 
ఏప్రిల్ 30వ తేదీన ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ట్వీట్ చేసింది. ఓ పేలుడు సంభవించిన సమయంలో ఓ మహిళ స్కర్క్ గాలికి పైకి లేస్తున్నట్టు అందులో ఉంది. ఫేమస్ అమెరికన్ ఆర్టిస్ట్ మారిలిన్ మోన్‍రోయ్ ‘ఫ్లయింగ్ స్కర్ట్’ ఫోజ్‍లా ఆ ఫొటో ఉంది. అయితే, ఈ ఫొటోలోని ముఖం కాళీ మాతను గుర్తుకు తెచ్చేలా పోలికలతో ఉంది.
 
ఈ చిత్రాన్ని ఉక్రెయిన్ ఆర్టిస్ట్ మక్సిమ్ పలెంకో వేశారు. దీన్ని ఆ దేశ రక్షణ శాఖ “వర్క్ ఆఫ్ ఆర్ట్” అంటూ ట్వీట్ చేసింది.  కాళీ మాతను పోలి ఉండేలా అభ్యంతరకరంగా ఫొటోను పోస్ట్ చేయటంతో ఉక్రెయిన్‍పై నెటిజన్లు మండిపడ్డారు. ఉక్రెయిన్ తీరును తీవ్రంగా నిరసిస్తూ కామెంట్లు చేశారు. భారత్‍కు, హిందువులకు ఉక్రెయిన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
దీంతో ఆ ట్వీట్‍ను ఉక్రెయిన్ రక్షణ శాఖ డిలీట్ చేసింది. అయినా, విమర్శలు కొనసాగటంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అయితే, రష్యాకు భారత్‍ కాస్త మద్దతు తెలుపుతోందనేలా ఉక్రెయిన్ సహా ఐరోపా దేశాలు పరోక్షంగా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి.