కర్ణాటకలో మరోసారి బిజెపి ప్రభుత్వం

కర్ణాటకలో మరోసారి బిజెపి ప్రభుత్వం
* జీ న్యూస్ – మాట్రిజ్ పోల్ సర్వే … గేమ్ చేంజర్ గా మోదీ

కర్ణాటకలో నాలుగు దశాబ్దాల వరవడి భిన్నంగా మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతుందని  జీ న్యూస్ – మాట్రిజ్ సంస్థ కలిసి సేకరించిన అభిప్రాయ సేకరణ వెల్లడించింది. కర్ణాటకలో భారతీయ జనతా పార్లో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలవబోతోందని, ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్, జనతా దళ్ సెక్యులర్ నిలుస్తాయని వెల్లడించింది.

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 113. ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీకి 103 నుంచి 115 సీట్లు వస్తాయి.కాంగ్రెస్‌కి 79 నుంచి 91 సీట్లు వస్తాయనీ, జేడీఎస్ కి 26 నుంచి 36 సీట్లు వస్తాయని ఈ పోల్ చెబుతోంది. ఇతరులకు 1 నుంచి 3 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. ఐతే 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 104, కాంగ్రెస్  80, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకున్నాయి.

ఓట్ల శాతంగా చూస్తే బీజేపీకి 42 శాతం, కాంగ్రెస్‌కి 40 శాతం, జేడీఎస్‌కి 15 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు లభిస్తాయని ఈ పోల్ తెలిపింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలను శాసించే లింగాయత్ వర్గం ఓటర్లు ఈసారి బీజేపీకే మద్దతు ఇస్తారనీ, 66 శాతం ఓటు బ్యాంకును ఆ పార్టీ పొందుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు 16 శాతం మంది, జేడీఎస్‌కి 8 శాతం, ఇతరులకు 10 శాతం లింగాయత్‌ల ఓట్లు లభిస్తాయని ఈ పోల్ చెబుతోంది.  మరో ప్రధాన వర్గమైన ఒక్కలిగల్లో 52 శాతం మంది జేడీఎస్‌కీ, 28 శాతం మంది కాంగ్రెస్‌కీ, 4 శాతం మంది ఇతరులకు ఓటు వేస్తారనే అంచనా ఉంది.

ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గేమ్ ఛేంజర్ అవుతున్నారని ఈ పోల్ అంటోంది. అదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కి కొద్దిగా ప్రయోజనం కలిగించనుందని తెలిపింది. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో పాల్గొనడం వల్ల గేమ్ ఛేంజర్ అవుతున్నారని అభిప్రాయపడ్డారు. 22 శాతం మంది కొంతవరకూ గేమ్ ఛేంజర్ కావచ్చని చెప్పగా, 22 శాతం మంది మోదీ వేవ్ లేదని పేర్కొన్నారు.

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావచ్చు అనే అంశంలో మొదటి స్థానాన్ని ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మైకే అప్పగిస్తున్నారు ఓటర్లు అని ఈ పోల్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య, జేడీఎస్ నుంచి హెచ్ డీ కుమారస్వామి ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్ కూడా ఉన్నారు.

బొమ్మైకి 28 శాతం మంది మద్దతు ఇవ్వగా,  సిద్ధరామయ్యకు 24 శాతం, కుమారస్వామికి 11 శాతం, ఇతరులకు 23 శాతం మంది మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. బొమ్మై పనితీరుపై 33 శాతం మంది సంతృప్తి చెందగా, 41 శాతం మంది పాక్షికంగా సంతృప్తి చెందారని, 29 శాతం మంది అసంతృప్తి చెందారని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్ ప్రధాని మోదీని ఉద్దేశించి విషపూరిత పాము అని విమర్శించడం బీజేపీకి ప్లస్ అవుతుందని ఈ ఒపీనియన్ పోల్ చెబుతోంది. ఈ విమర్శ బీజేపీకి కలిసొస్తుందని 56 శాతం మంది అభిప్రాయపడగా, 32 శాతం మంది ఇది కాంగ్రెస్‌కి హాని చేస్తుందని చెప్పారని, 12 శాతంమంది ఏ నిర్ణయమూ చెప్పలేదని తెలిపారు.

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కి ఈ ఎన్నికల్లో ప్రయోజనం కలిగించదని 62 శాతం మంది భావిస్తుండగా, 12 శాతం మంది భారీగా ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. 26 శాతం మంది కొద్దిగా ప్రయోజనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

సంకీర్ణ సర్కారు వస్తే ఏయే పార్టీలు కలవడం మంచిది అనే అంశంలో బీజేపీ+ జేడీఎస్ కలవాలని 54 శాతం మంది కోరుకోగా, 28 శాతం మంది కాంగ్రెస్+ జేడీఎస్ కలవాలని కోరుకున్నారు. 18 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈ ఒపీనియన్ పోల్ కోసం జీ న్యూస్ 3 లక్షల మంది అభిప్రాయం తీసుకున్నట్లు తెలిపింది. వీరిలో 1.80 లక్షల మంది మగవారు, 1.12 లక్షల మంది ఆడవారు ఉన్నట్లు తెలిపింది.

ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య ఉండగా ఆప్,   బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం,  సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. 224 స్థానాల అసెంబ్లీలో 36 సీట్లు ఎస్సీలకు 15 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి.