ఎన్​సీపీ అధ్యక్ష పదవికి శరద్​ పవార్​ రాజీనామా

గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని ఎన్సీపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలు మంగళవారం కీలక మలుపు తిరిగాయి. రాజకీయ వ్యూహకర్త, ట్రబుల్ షూటర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు.  ఇప్పటికే తనకు రాజ్యసభలో మరో మూడేళ్ల సభ్యత్వం ఉంది అన్న ఆయన ఇంతకు మించిన అదనపు బాధ్యతలను తాను తీసుకోను అని తెలిపారు.

పార్టీ పదవి నుంచి మాత్రమే తప్పుకుంటున్నా అన్న శరద్ పవార్ ప్రజా జీవితం నుంచి తప్పుకోవట్లేదని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మహారాష్ట్ర,  దేశానికి సంబంధించిన అంశాలపై తాను దృష్టి సారిస్తానని శరద్ పవార్ తెలిపారు. 1960 మే 1న రాజకీయ ప్రస్థానం ప్రారంభించానన్న ఈ రాజకీయ చాణక్యుడు నిన్న మేడే వేడుకల్లో పాల్గొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడోకప్పుడు తప్పుకోవడం తప్పదన్న ఆయన ఎవరికైనా అత్యాశ పనికిరాదని పేర్కొన్నారు.

తాను అధ్యక్ష పదవిని పట్టుకొని ఎక్కువ సంత్సరాలు కొనసాగితే  పార్టీలోని మిగతా వారికి అది ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. అందుకే పార్టీ అధ్యక్ష పదవి నుండి విరమణ ప్రకటిస్తున్నాననితెలిపారు. లోక్ మాజ్ సంగతి ఆటోబయోగ్రఫీ సెకండ్ ఎడిషన్ ప్రారంభ కార్యక్రమంలో శరద్ పవార్ ఈ ప్రకటన చేశారు. తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.

పవార్ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురైన ఆయన అభిమానులు.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగిన అభిమానులు.. కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు, కొత్త ఆధ్యక్షుడి ఎంపికకు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఆ పార్టీ సీనియర్ నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే, కేకే శర్మ, పీసీ చాకో, జయంత్ పాటిల్, సుప్రియో సూలే, చగన్ భుజ్‌బల్, దిలీప్ వాస్లే పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేశ్ తోపే, జితేంద్రవాహద్, హసన్ ముషిరిఫ్, దనుంజయ్ ముండే సహ ఇతరులకు కమిటీలో చోటు కల్పించారు.

పవార్ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురైన ఆయన అభిమానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  శరద్‌ పవార్‌ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ  వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల కారణంగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పార్టీలో ఎప్పటిలాగే అందరం కలిసి పనిచేద్దామని, తన రాజీనామాకు అందరూ ఆమోదం తెలుపాలని ఆయన కోరారు. అయినా ఎన్సీపీ శ్రేణులు ఒప్పుకోవడం లేదు.

శరద్‌ పవార్‌తో మాట్లాడి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని ఆయన కుమార్తె సుప్రియా సూలేకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ పెద్దాయన వయసును, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు.

ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నారని, ఇక ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే అవకాశమే లేదని చెప్పారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని సుప్రియా సూలే తన తండ్రి పవార్‌ను కోరే ప్రయత్నం చేసిందని, కానీ ఆమెకు పెద్దన్నగా తాను ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నానని అజిత్‌ పవార్‌ చెప్పారు. అయితే, పవార్‌ రాజీనామాను అంగీకరించాలా? వద్దా? అనే దానిపై పార్టీ సీనియర్‌ నాయకులతో ఒక కమిటీ వేశామని, ఆ కమిటీ నిర్ణయానికి అందరం కట్టుబడాలని అజిత్‌ పవార్‌ కోరారు. పవార్‌ జీ కూడా కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు.