తెలుగు రాష్ట్రాల మీదుగా భువనేశ్వర్ కు మరో వందేభారత్

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్టణం, అదే విధంగా సికింద్రాబాద్ టు తిరుపతిలకు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో కొనసాగుతోంది. ఈ రెండు రైళ్లతో పాటుగా మరో మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతుంది.

హైదరాబాద్ టు భువనేశ్వర్ మధ్య వందేభారత్ పై ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే  హైదరాబాద్ – బెంగుళూరు కొత్త వందేభారత్ రైలు ఏర్పాటు పైన ఇప్పటికే సర్వే పూర్తి చేసారు. దాదాపుగా రూటు విషయం లోనూ నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఉన్న రద్దీని తట్టుకొనేందుకు ఈ రైలు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఈ రైలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి పూణేకు మరో వందేభారత్ ప్రతిపాదన పైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. లాంగ్ జర్నీ కావటంతో నడపాల్సిన వేళల పైన కసరత్తు జరుగుతోంది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ రైలు ఎప్పుడు ప్రారంభించేదీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్ – భువనేశ్వర్ మధ్య వందేభారత్ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.

ఒడిశా ప్రభుత్వం తాజాగా కేంద్రానికి తమ రాష్ట్రంలో మూడు వందేభారత్ రైళ్లకు సంబంధించి ప్రతిపాదనలు అందించింది. అందులో పూరీ-హౌరా, పూరీ-రూర్కేలా, హైదరాబాద్ – భువనేశ్వర్ ఉన్నాయి.  హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ లైన్ కు ఉన్న డిమాండ్ తో దీనిని రైల్వే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఒడిశాకు: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ కు నిత్యం అనేక రైళ్లు రద్దీతో కొనసాగుతున్నాయి.

ఇప్పుడు తెలంగాణ – ఒడిశా రాజధానుల మధ్య వందేభారత్ ప్రారంభిస్తే తెలంగాణ, ఏపీ జిల్లాల మీదుగా భువనేశ్వర్ కు రైలు అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే రైళ్లు, సికింద్రాబాద్ టు భువనేశ్వర్ రైళ్లల్లో నిత్యం భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది.

అయితే, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో అధికారులు కొత్త ప్రతిపాదన కూడా తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు వందేభారత్ అందుబాటులో ఉండటంతో, విశాఖ టు భువనేశ్వర్ వందేభారత్ పైన ప్రతిపాదనలు ఇచ్చినట్లు సమాచారం. దీని పైన రైల్వే శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.