నా ఆలోచనకు బిజెపి తప్ప ఏ పార్టీ సెట్ కాదు

తాను తెలుగుదేశంలోకి వెళ్తున్నానంటూ జోరుగా జరుగుతున్న ప్రచారాన్ని బిజెపి నుండి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ కొట్టిపారేసారు. ఈ ప్రచారం గురించి విడుదల చేసిన ఓ వీడియోలో  తాను ఏ పార్టీలోకి వెళ్లనని, బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన ఆలోచన విధానానికి బీజేపీ తప్ప ఏ పార్టీ సెట్ కాదని పేర్కొంటూ హిందూ ధర్మ స్థాపనే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

“నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతంది. నాకు అలాంటి ఆలోచన లేదు. నా ఆలోచన విధానానికి ఏ పార్టీ సెట్ కాదు. ఒక్క బీజేపీ తప్ప! నా మొదటి ప్రాధాన్యత హిందూ ధర్మం. నాలాంటి వ్యక్తిని ఏ పార్టీ కూడా తీసుకోదు” అని ప్రకటించారు.  పార్టీ విధించిన సస్పెన్షన్ పై తనకు స్పష్టత రావాల్సి ఉందని చెబుతూ తనకు మద్దతుగా బీజేపీ నేతలు ఉన్నారని తెలిపారు.

‘నేను పార్టీ మారట్లేదు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. టీడీపీలోకి వెళ్లే ఆలోచన లేదు. సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. నిన్న నేను మధ్యప్రదేశ్‌లో ఒక కార్యక్రమంలో ఉన్నాను. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు అక్కడే ఉన్నాను. అప్పుడు నేను టీడీపీలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీలో చేరాలని నేను ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు. నా మనస్తత్వానికి ఏ పార్టీ సెట్ అవ్వదు. నేను తొలి ప్రాధాన్యత హిందూ ధర్మం కోసం ఇస్తా’ అని రాజాసింగ్ వీడియోలో పేర్కొన్నారు.

‘నా లాంటి వ్యక్తులను బీజేపీ తప్ప ఏ పార్టీ తీసుకోదు. సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారో కూడా చెప్పలేం. కానీ బండి సంజయ్, బీజేపీ నేతలు నా వెంటే ఉన్నారు. నాకు మద్దతు ఇస్తామని చెప్పారు. చాలామంది కేంద్రమంత్రులు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక కేంద్రమంత్రి కార్యక్రమంలో పాల్గొన్నా’ అని రాజాసింగ్ తెలిపారు.

ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్‌ గోరక్ష పేరుతో స్వయంగా అతనే రంగంలోకి దిగుతుంటారు. హిందూ ధర్మ రక్షణే తన ధ్యేయం అంటూ దూకుడుగా ముందుకెళ్తుంటారు. శ్రీరామనవమి వస్తే రాజాసింగ్ తలపెట్టే శోభాయాత్ర ఓ రేంజ్ లోనే ఉంటుంది. ఇందుకోసం భారీ స్థాయిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తుంటారు.

మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆయన రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. గో సంరక్షణ, హిందూ వాహిని సభ్యుడిగా ప్రవేశించిన ఆయన శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల నిర్వహణతో వెలుగులోకి వచ్చారు.

 అయితే రాజాసింగ్ రాజకీయ ప్రవేశం మాత్రం తెలుగుదేశంతో కావటం ఆసక్తికరం. గతంలో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్‌ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 2014, 2018లలో గోషామహల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌. దీంతో శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు.

కొద్దిరోజుల క్రితం మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో బిజెపి జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.  ఇంకా ఆ ఆదేశాలు అమల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం పార్టీకి సంబంధం లేకుండానే కార్యక్రమాలను చేసుకుంటున్నారు.