మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ తిరస్కరించారు.
 
లిక్కర్ మద్యం కుంభకోణంగా పేరొందిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 9వ తేదీన మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైళ్లో ఉన్నారు. తనపై ఈడీ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు లో మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు దయన్ కృష్ణన్, వివేక్ జైన్ వాదించారు.
 
సిసోడియాపై ఈడీ చేస్తున్న ఆరోపణలు కూడా ఢిల్లీ ప్రభుత్వం తరఫున రూపొందించిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించినవేనని వారు గుర్తు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకు, ఆయన ఆధీనంలో ఉండే అధికారులు మనీశ్ సిసోడియాకు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇచ్చారని వారు వాదించారు.
 
మరోవైపు, ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో, దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ లో మనీశ్ సిసోడియాది కీలక పాత్ర అని ఈడీ వాదించింది. కొన్ని ప్రైవేటు కంపెనీలకు హోల్‌సేల్‌ ట్రేడింగ్‌ లాభం 12శాతం ఇవ్వాలనే కుట్రలో భాగంగానే పాలసీని తీసుకువచ్చారని ఈడీ ఆరోపించింది.
 
సిసోడియా 14 ఫోన్‌లను ధ్వంసం చేసిందని, వాటిలో రెండు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇతర వ్యక్తుల పేరుతో సిమ్‌కార్డులు, ఫోన్‌లను ఆప్‌ నాయకుడు కొనుగోలు చేసి వాడినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు.