చీతాల మరణాన్ని ముందుగానే ఉహించామన్న ఆఫ్రికా

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన రెండు చీతాలు మధ్యప్రదేశ్‌ లోని కూనో నేషనల్‌ పార్క్‌ లో ఇటీవల నెల రోజుల వ్యవధిలోనే అనారోగ్యంతో ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి. ఈ నేపథ్యంలో చీతాల మృతిపై తాజాగా దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ స్పందిస్తూ తాము ముందుగానే ఊహించినట్టు తెలిపింది.

‘ఇప్పటి వరకు రెండు చిరుతల మరణాలు నమోదయ్యాయి. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మరణాల రేటు ఉంటుందని మేం గతంలోనే అంచనా వేశాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. పెద్ద మాంసాహార జంతువులను ఒకచోటు నుంచి మరొక చోటుకు తరలించి వాటిని జాగ్రత్తగా చూసుకోవడమనేది సహజంగానే చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నది.

`ప్రస్తుతం సాగుతున్నది ప్రాజెక్టులోని క్లిష్టమైన దశ. చిరుతలను పెద్ద వాతావరణంలోకి విడుదల చేస్తారు. అక్కడ వాటి రోజువారీ పరిస్థితిపై నియంత్రణ చాలా తక్కువగా ఉంటుంది. గాయాలు, మరణాలు, ప్రమాదాలు పెరుగుతాయి. ఇవన్నీ ఈ ప్రాజెక్టులో భాగమే’ అని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలన్నీ పెద్ద ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి.

ప్రతి రోజూ కనీసం రెండుసార్లైనా వాటిని నిశితంగా పరిశీలించాలి. వాటి ప్రవర్తన, కదలికలు, శరీర స్థితిని దూరం నుంచి అంచనా వేయాలి. ఇలా చేయడం వల్ల చిరుతల ఆరోగ్య పరిస్థితి గురించి అంచనాకు రాగలమని వివరించింది. చిరుత మరణానికి సంబంధించిన శవపరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. చనిపోయిన చిరుతకు ఏదైనా అంటు వ్యాధి సోకిందా? ఇతర చిరుతలకు ఇలాంటి ప్రమాదం ఏదైనా ఉందా? అనే దానిపై ఎలాంటి సూచన లేదని ప్రకటనలో వెల్లడించింది.

కాగా, దేశంలో అంతరించిపోతున్న చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్కుకు తీసుకొచ్చారు.

రెండో దశలో ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. అందులోని ఉదయ్ అనే చీతా ఏప్రిల్‌ 23న మరణించగా గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటైన సాషా ఈ ఏడాది మార్చిలో కన్నుమూసింది. రెండు చీతాల మరణంతో ఇప్పుడున్న చీతాల సంఖ్య 20 నుంచి 18కి పడిపోయింది.