దళిత బందులో ఎమ్యెల్యేల కమీషన్లు .. కేసీఆర్ హెచ్చరిక

ద‌ళిత‌బంధు ప‌థ‌కంలో కొంద‌రు ఎమ్మెల్యేలు క‌మిష‌న్లు తీసుకుంటున్నారు. ఈ ఆరోపణ చేసింది ఎవ్వరో ప్రతిపక్ష నేతలు కాదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, బిఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన పార్టీ ప్లీనరీలో  ప్రస్తావించారు. అటువంటి ఎమ్యెల్యేల చిట్టా తన వద్ద ఉందని కూడా వెల్లడించాయిరు.
 
ప‌ద్ద‌తులు మాన‌కుంటే సీటు ఉండ‌దు, పార్టీ అండ ఉండ‌దంతూ కాస్త ప‌రుషంగా హెచ్చ‌రించారు. అలాగే ఎమ్మెల్యేలు కాకుండా వారికి సంబంధించి ద‌ళిత‌బందులో క‌మిష‌న్ లు తీసుకున్నా ఆ బాధ్య‌త ఎమ్మెల్యేదేనంటూ తేల్చి చెప్పారు. వ్య‌క్తుల కంటే పార్టీ ముఖ్య‌మని కెసిఆర్ పేర్కొన్నారు.
 
దళిత బంధుపై రోజురోజుకు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండడంతో కేసీఆర్ పార్టీ సమావేశంలోనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. మరోసారి వసూళ్లకు పాల్పడితే.. టికెట్ కాదు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని కూడా తెలిపారు.
 
దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల రూపాయల దళిత బంధులో మూడు లక్షల రూపాయిలను నొక్కేస్తున్నారని స్వయంగా సీఎం చెప్పుకురావడం గమనార్హం. ఆ ఎమ్మెల్యేల సంగతి తేలుస్తా అని చెప్పారు. పార్టీకి ప్రజల వద్ద మంచి ఆదరణ ఉందని, గతంలో కంటే మరిన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందన్న సీఎం దళిత బంధు పథకంలో జరిగే అవినీతికి సంబంధించి ఎమ్మెల్యేలందరికి ఓ హెచ్చరిక ఇచ్చారు.
 
అంటే ఈ పధకం అమలులో జరుగుతున్న అవినీతి వచ్చే ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపగలదని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.  అక్టోబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజా ప్రతినిధులందరూ ఆయా నియోజకవర్గాలలోనే ఉంటూ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు.
 
అదేవిధంగా, పలు నియోజకవర్గాలలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న కుమ్ములాటలు పట్ల కూడా కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అంటూ ఎలాంటి సమస్య ఉన్నా అధిష్ఠానంతో విన్నవించుకోవాలని సూచించారు. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడాన్ని హితవు చెప్పారు.
 
ఇక, వచ్చే ఎన్నికలలో వందకు పైగా సీట్లను గెలుస్తామంటూ కేసీఆర్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అంటే, మిగిలిన పార్టీలకు దాదాపుగా అసలు సీట్లు ఏవీ రావంటూ చెప్పుకొచ్చారు. ‘మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తాం’ అని తెలిపారు.