ఇది విశ్వ నగరమా.. విషాద నగరమా?

చిన్న పాటి వర్షానికే హైదరాబాద్‌లో కాలనీలు మునిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ నాలాల నుంచి వెళ్లాల్సిన వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుందని పేర్కొంటూ ఇది విశ్వ నగరమా? విషాద నగరమా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ విశ్వనగరం పలుకులు ఏమయ్యాయి? ఎందుకు చెయ్యలేదని నిలదీశారు.
 
 తొమ్మిదేళ్లు సరిపోలేదా? విశ్వనగరం చేసేందుకు అని మండిపడ్డారు. రూ.  60 వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారని చెబుతూ ఆ డబ్బంతా ఎక్కడకు పోయిందని ఆయన నిలదీశారు. హైదరాబాద్ చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతానన్నారని గుర్తు చేస్తూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎందుకు కట్టలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
నాలాల్లో పూడిక ఎందుకు తియ్యడం లేదని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే నిధులన్నీ హైదరాబాద్ నుంచి వచ్చేవే అని చెప్పుకొచ్చారని అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు విజన్ ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చిన అభివృద్ధి చేయడం లేదని  ఆయన విమర్శించారు.
 
కనీసం కుక్కలను కూడా నియంత్రించడం లేదని రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నిజాం కాలం నాటి వాటర్, సివరేజ్ లైన్స్‌ను మాడిఫైడ్ చేయించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ట్యాంక్ బండ్‌లో మంచి నీళ్ళు నింపుతామన్న కేసీఆర్ ఎందుకు పట్టించు కోవడం లేదని, హైదరాబాద్‌కు ఎందుకు గోదావరి నీళ్లు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
హైదరాబాద్‌లో ఎన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు కట్టారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.  బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాలాలను కబ్జా చేశారని బిజెపి నేత ఆరోపించారు. మూసీ నది సుందరీకరణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.