పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) మంగళవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రకాశ్ సింగ్ బాదల్ వారం క్రితం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని పేర్కొనడంతో కుటుంబ సభ్యులు ఆయనను మొహలీలోని ఫోర్టిస్ దవాఖానలో చేర్చారు.

దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. జాట్ సిక్కు కుటుంబానికి చెందిన ప్రకాశ్ సింగ్ బాదల్ 1927 డిసెంబర్ 8న మాలౌట్‌కు సమీపాన అబుల్ ఖురానాలో జన్మించారు. లాహోర్ లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. అకాలీదళ్ పార్టీకి సారథ్యం వహించిన ప్రకాశ్ సింగ్ బాదల్ ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.

రాష్ట్రానికి అతి పిన్న వయస్సులోనే సీఎంగా సారధ్యం వహించిన రికార్డు ప్రకాశ్ సింగ్ బాదల్ సొంతం. తొలిసారి 1970 నుంచి 1971, 1977 నుంచి 1980, 1997 నుంచి 2002, 2007 నుంచి 2017 వ‌ర‌కు పంజాబ్ సీఎంగా ప‌ని చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బాదల్ సారధ్యంలోని అకాలీదళ్ మద్దతు తెలిపింది. నాటి నుంచి 2020లో కేంద్రం రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలు చేసే వరకు బీజేపీ, అకాలీదళ్ మధ్య కూటమి రాజకీయాలు సాగాయి.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యంతో దవాఖానలో చేరిన సంగతి తెలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనను ఫోన్ లోనే పరామర్శించారు. గత వారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బాదల్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

శిరోమ‌ణి అకాలీద‌ళ్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఆయ‌న ఒక‌రు. 1995 నుంచి 2008 వ‌ర‌కు పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. 2008లో ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ త‌న‌యుడు సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ అకాలీద‌ళ్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. బాదల్‌ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కుమార్తె ప్రణీత్ కౌర్.

శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ క‌మిటీపై ప‌ట్టు సాధించిన నేత‌. 2015లో కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారంతో గౌర‌వించింది. 1947లోనే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రకాశ్ సింగ్ బాదల్ తొలుత బాదల్ గ్రామ సర్పంచ్‌గా, బ్లాక్ సమితి చైర్మన్ గా ఎన్నికయ్యారు.

శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫునే తొలిసారి 1957లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969లో తిరిగి అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ రాష్ట్ర పంచాయతీరాజ్, పశు సంవర్ధక శాఖ మంత్రిగా పని చేశారు. పది సార్లు శాసనసభకు ఎన్నికైన బాదల్1972, 1980, 2002లలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే, 1992 అసెంబ్లీ ఎన్నికలను అకాలీలు బహిష్కరించడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ముఖ్యనేత రాబుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, ప్రముఖ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని మోదీ ట్వీట్ చేశారు.