ప్రజల దృష్టి మళ్లించేందుకు  బిఆర్ఎస్ కు పావుగా మారిన షర్మిల! 

ప్రధాన ప్రతిపక్షాలకు (కాంగ్రెస్, బీజేపీ) చెందిన కీలక సమావేశాలు, ఆందోళలు జరుగుతున్న రోజున ప్రజల దృష్టి వాటి నుండి మళ్లించడం కోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, రాజకీయంగా తెలంగాణాలో చెప్పుకోదగిన ప్రాధాన్యత లేని వైఎస్సార్ టీపీ ఆందోళనలను శాంతిభద్రతల సమస్యగా సృష్టించడం అధికార బిఆర్ఎస్ అనుసరిస్తున్న  ఎత్తుగడగా కనిపిస్తున్నది.

తాజాగా జరిగిన వైఎస్ షర్మిల అరెస్ట్ కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నది.  కేవలం సిట్ వద్దకు వెళ్లి ఒక వినతిపత్రం సమర్పించేందుకు ఒంటరిగా ఇంట్లో నుండి బైటకు వచ్చే సరికి లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసుల తోపులాట, సర్కారుకు వ్యతిరేకంగా అనుచరుల నినాదాలు, గంటపాటు హైడ్రామా.. తర్వాత షర్మిల అరెస్ట్ జరిగాయి.

అదే సమయంలో కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లడం, మరోవంక, ఖమ్మంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మీడియాలో వారిద్దరి వార్తలకు తగు ప్రాధాన్యత లేకుండా, షర్మిల అరెస్ట్ గురించే ఆ రోజంతా కనిపించే విధంగా ప్రభుత్వం చేసినట్లు కనిపిస్తున్నది.

కొత్తగా ఏర్పాటైన వైఎస్సార్టీపీకి మద్దతుదారుల సంఖ్యా పరిమితంగానే ఉన్నారు. కేవలం షర్మిల మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆమెను హౌస్ అరెస్టు చేయడం వల్ల లేని హడావుడిని పోలీసులు సృష్టించడం తప్ప ప్రయోజనం కనిపించడమా లేదు. గతంలో పలు సందర్భాలలో కూడా విపక్షాలకు  సంబంధించిన కీలక సమావేశాలు, సభలు ఉన్నప్పుడు షర్మిల నిరసనలను సర్కారు పావుగా వాడుకున్నట్లు స్పష్టం అవుతుంది.

మార్చ్ 31న, ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ ఆఫీసుకు ముట్టడించారు. ఆమె రాగానే భారీ బలగాలు చుట్టుమట్టి అరెస్టు చేసి లోటస్ పాండ్ లోని ఆమె నివాసానికి తరలించడంతోపాటు, లుక్ అవుట్ నోటీసులు జారీచేయడం సంచలనం రేకెత్తించింది. ఆఫీసు ముట్టడికి యత్నిస్తే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది.

అదే రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో నూతనంగా నిర్మించిన బీజేపీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా చేసిన కామెంట్లకు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 

ఇక మార్చ్ 28న జనతా మార్చ్ పేరుతో  ఉస్మానియా ఆస్పత్రిలో రోగులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఆమె కింద పడిపోయారు. అదే రోజు బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయం నుండి కాస్తా షర్మిల ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది.

ఇక, గత ఏడాది నవంబర్ 29న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆయన భార్యలపై షర్మిల అంతకు ముందు రోజు ఆరోపణలకు నిరసనగా ఆమెపై దాడి చేశారు. దీనిపై తన అనుచరులతో కలిసి షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరారు. సోమాజిగూడ వద్ద ఆమె  ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. ఆమె స్వయంగా డ్రైవ్ చేయడంతో టోయింగ్ వాహనం సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన హైడ్రామాలో షర్మిల వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.

 వాస్తవానికి, అదే రోజు బండి సంజయ్ నిర్మల్ జిల్లా భైంసా సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సభకు అనుమతిని నిరాకరించడంతో ఆయన హైకోర్టు అనుమతితో ఏర్పాటు చేసిన సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. అయితే, మీడియా దృష్టి భైంసా సభ నుండి షర్మిల అరెస్టు వైపు వ్యూహాత్మకంగా మళ్ళించిన్నట్లు అర్థం అవుతుంది.