అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బైడెన్ ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డెమొక్రటిక్ పార్టీ తరఫున రీ ఎలక్షన్ బిడ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు బైడెన్ ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన 2024 అధ్యక్ష ఎన్నికలను రిపబ్లికన్ల అతివాదంపై పోరాటంగా బైడెన్ అభివర్ణించారు. ఇక వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సైతం వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా తిరిగి పోటీ చేస్తారని బైడెన్ ప్రకటించారు.
‘ప్రజాస్వామ్యం కోసం, స్వాతంత్య్రం కోసం ప్రతి తరం వారు నిలబడాల్సిన క్షణం ఒకటి ఉంటుంది. ఇది మన సమయం అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేస్తున్నా. మాకు మద్దతుగా నిలవండి’ అని బైడెన్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు. గత అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. ఆ తర్వాత 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన చిత్రాలతో బైడెన్ ఇప్పుడు విడుదల చేసిన వీడియో మొదలైంది.
“అమెరికన్లుగా మనందరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమికమైన హక్కు. అంతకంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మన ప్రజాస్వామ్యం కోసం, ప్రజల హక్కులను రక్షించేందుకు నా మొదటి (ప్రస్తుతం) హయాంలో కృషి చేస్తున్నా. దేశంలో ప్రతీ ఒక్కరినీ సమానంగా చూసేలా, అందరికీ సమాన హక్కులు దక్కేలా చేస్తున్నా” అని బైడెన్ ఆ వీడియోలో తెలిపారు.
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష బరిలో నిలిచే వారి కోసం ఆయా పార్టీల్లో ప్రైమరీ ఎన్నికలు జరుగుతుంటాయి. అధ్యక్షుడు రెండోసారి బరిలోకి దిగుతుండడంతో అధికార పార్టీలో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మరో వైపు రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే అదే పార్టీకి చెందిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ సైతం పోటీ చేసే అవకాశాలున్నాయి.ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో అమెకన్లు బైడెన్‌కు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. వయసు పైబడుతుండడంతో మరోసారి ఆయనను అధ్యక్ష పీఠం ఎక్కిస్తారా? లేదా? సందిగ్ధం నెలకొన్నది. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధుడైన అధ్యక్షునిగా ఉన్నారు.
మరో వైపు ఆయన ‘రహస్య పత్రాల’ వివాదంలో చిక్కుకున్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ఆప్ఘనిస్థాన్ నుంచి బలగాల ఉప సంహరణ తదితర అంశాలపై ఇప్పటికే ట్రంప్ బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఇవి కీలక ప్రభావం చూపనున్నాయి.
More Stories
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత