సుడాన్ నుంచి యుద్ధనౌక‌లో బ‌య‌లుదేరిన 278 మంది భార‌తీయులు

సుడాన్ నుంచి యుద్ధనౌక‌లో బ‌య‌లుదేరిన 278 మంది భార‌తీయులు

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సూడాన్‌ ఓడరేవుకు దాదాపు 500 మంది వరకు భారతీయులు చేరుకున్నారు. ఇంకా మరికొంతమంది అక్కడకు చేరుకుంటున్నారు.

నౌకలు, విమానాలను అక్కడకు ఇప్పటికే పంపించింది భారత ప్రభుత్వం. సూడన్ లో ఉన్న భారతీయులకు అన్నివిధాలా సాయపడేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. తొలివిడతగా 278 మంది భారతీయులను యుద్ధనౌక ద్వారా సూడాన్‌ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

అక్కడి నుంచి విమాన మార్గంలో స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సూడాన్‌లోని సాయుధ వర్గాలు 72 గంటల కాల్పుల విరమణకు అంగీకరించడం కూడా ఆపరేషన్‌ కావేరి చేపట్టేందుకు సుగమమైంది. నేవీ షిప్ ఐఎన్ఎస్ సుమేదాలో తొలి బ్యాచ్‌ బ‌య‌లుదేరింది. ఆ యుద్ధనౌక సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి త‌న ట్విట్టర్‌లో తెలిపారు.

ఆప‌రేష‌న్ కావేరీలో భాగంగా ఈ త‌ర‌లింపు ప్రక్రియ కొన‌సాగుతోంది.  విదేశాంగ శాఖ ప్రతినిధి అరింద‌మ్ బాగ్చి త‌న ట్విట్టర్‌లో ఐఎన్ఎస్ సుమేదా ఫోటోల‌ను పోస్టు చేశారు. పోస్టు సుడాన్ నుంచి జెడ్డాకు సుమారు 278 మంది యుద్ధ నౌక సుమేదాలో వ‌స్తున్నట్లు బాగ్చి తెలిపారు.

ఈ క్రమంలో భారత్ మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. శ్రీలంకకు అండగా నిలిచింది. శ్రీలంక దేశస్థులను సూడాన్ నుంచి తరలించడానికి శ్రీలంక ప్రభుత్వానికి భారత్ సహకారం అందిస్తోంది. ఈ విషయంపై శ్రీలంక భారత్ కు ధన్యవాదాలు తెలిపింది. భారత్ సాయంతో మరికొన్ని రోజుల్లో శ్రీలంక దేశస్థులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలమని శ్రీలంక ధీమా వ్యక్తం చేసింది.