`ఇస్లాంలో పుట్టిన పంజాబీ’ తారేక్ ఫతా కన్నుమూత 

`ఇస్లాంలో పుట్టిన పంజాబీ’ తారేక్ ఫతా కన్నుమూత 

కెనడాలో స్థిరపడిన ప్రముఖ కాలమిస్ట్, రచయిత తారేక్ ఫతా (73) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి చెందినట్లు కూతురు నటాషా ఫతా ధృవీకరించింది. కొద్ది రోజుల క్రితం ఆయన మృతి చెందినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

“పంజాబ్ సింహం, భారత్ ముద్దుబిడ్డ, కెనడాను ప్రేమించిన వ్యక్తి, సత్యం కోసం పాటుపడే వ్యక్తి, న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి, బడుగు బలహీనవర్గాల గొంతుకను వినిపించిన వ్యక్తి ఇక లేరు. తాను భౌతికంగా లేనప్పటికీ తన ఆశయాలు మాత్రం బతికే ఉంటాయి” అంటూ తారేక్ ఫతా కూతురు నటాషా ట్వీట్ చేశారు.
 ఏప్రిల్ 21నే తారేక్ ఫతా కన్నుమూసినట్లు పలు వార్తలు షికారు చేశాయి. అయితే అవి సత్యదూరమని కుటుంబ సభ్యులు ఖండించారు. తారేక్ ఫతా ఎల్‌జీబీటీ హక్కుల కోసం పోరాడాడు. వారికి అండగా నిలిచాడు. షరియా చట్టాన్ని వ్యతిరేకించాడు. ఇస్లాం మతం ప్రగతిశీల రూపం కోసం నినదించారు.
తాను పాకిస్తాన్‌లో జన్మించిన భారతీయుడునని, ఇస్లాంలో పుట్టిన పంజాబీ అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవాడు.
తారేక్ ఫతా పాకిస్తాన్ మతపరమైన విధానాలను విమర్శించేవాడు. అంతేకాదు 1947లో జరిగిన భారతదేశ విభజనపై కూడా వ్యతిరేకించాడు. పాకిస్థాన్ విధానాలను తరచూ వ్యతిరేకిస్తూ ఉండడంతో ఆయనకు అనేకసార్లు చంపుతామని హెచ్చరికలు వచ్చాయి. ఈ సంవత్సరంలోనే ఆయనను చంపితే రూ 10 లక్షల బహుమతిని బరేలీలోని ఓ ముస్లిం గ్రూప్ ప్రకటించింది.

పాకిస్తాన్‌లోని కరాచీలో ఒక పంజాబీ ముస్లిం కుటుంబంలో నవంబర్ 20, 1949న తారేక్ ఫతా జన్మించారు. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ముంబైను వీడి కరాచీలో స్థిరపడింది. 1970లో కరాచీ సన్ అనే వార్త సంస్థలో రిపోర్టర్‌గా జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించాడు. 1977లో ఫతాహపై దేశద్రోహం నేరం మోపబడింది. విద్యార్ధి దశలో వామపక్ష ఉద్యమాలలో పాల్గొన్నారు.
అనంతరం జియా ఉల్ హక్ ప్రభుత్వం జర్నలిజం రంగం నుంచి ఫతాహను నిషేధించింది. దీంతో ఆయన 1987లో కెనాడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సౌదీ అరేబియాలో కూడా ఉన్నారు.  తారేక్ ఫతా మరణించారన్న సంగతి బయట ప్రపంచానికి తెలియగానే సోషల్ మీడియాలో నెటిజెన్లు ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి తరేక్‌తో కలిసి తీసుకున్న ఫోటోలను ట్వీట్ చేస్తూ అలాంటి యోధుడు మళ్లీ పుట్టరని పేర్కొంటూ నివాళులు అర్పించారు.
ఆర్ఎస్ఎస్ శ్రద్ధాంజలి
తారక్ ఫతాహ్ ప్రముఖ ఆలోచనాపరుడు, రచయిత, వాక్యత అని పేర్కొంటూ మీడియా, సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోటామని పేర్కొంటూ ఆయన మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే శ్రద్ధాంజలి ఘటించారు. తన జీవితం అంతా తన విధానాలు, విశ్వాసాలకు కట్టుబడి ఉన్నారని, ఆయన ప్రదర్శించిన సాహసం, బలమైన విశ్వాలకు ఎల్లప్పుడూ గౌరవిస్తుంటామని తెలిపారు.