పోలీసుల కాల్పుల్లో ఇద్ద‌రు మ‌హిళా మావోయిస్టులు హ‌తం

ఇద్ద‌రు మ‌హిళా మావోయిస్టుల‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసుల స్పెష‌ల్ యాంటీ మావోయిస్ట్ హాక్స్ ఫోర్స్ కాల్చి చంపింది. కాగా మ‌ర‌ణించిన వారిని సునీత‌, స‌రిత‌లుగా గుర్తించారు. ఈ సంఘ‌ట‌న బాలాఘాట్ జిల్లాలోని అడ‌వుల్లో చోటు చేసుకుంది.
 
రూ.28 లక్షల రివార్డు ఉన్న వీరిద్దరి కోసం పలు రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చివరికి శనివారం వీరిద్దరు పోలీసులకు చిక్కి హతమయ్యారు. తాజా ఘటనతో మధ్యప్రదేశ్ లోని మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్, మాండ్లా జిల్లాల్లో రెండేళ్లలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
 
మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో వారిని అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీసుల హాక్ ఫోర్స్ బృందం బయలుదేరిందని తెలిపారు. బాలాఘాట్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో, మహారాష్ట్ర సరిహద్దుకు కిలోమీటరు దూరంలోని గాడీ ప్రాంతంలోని అడవిలో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు.
 
కాగా, భోరందేవ్ ఏసీఎం సునీత, ఖతియామోచా ఏసీఎం సరితను హాక్ ఫోర్స్ కాల్చి చంపినట్లు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ధృవీకరించింది. సునీత ప్రస్తుతం విస్తార్ దళంలో ఉండగా, సరిత వాంటెడ్ మావోయిస్టు కబీర్ కు గార్డుగా పనిచేసి ఇటీవల విస్తార్ దళానికి బదిలీ అయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు 303 రైఫిల్స్, లైవ్ కాట్రిడ్జ్ లు, రేషన్ లభించాయి.