మహిళలు ఈద్ వేడుకల్లో పాల్గొనకుండా తాలిబన్ల ఆంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ వేడుకలను సంతోషంతో జరుపుకున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌ మహిళలను ఈద్‌ వేడుకల్లో పాల్గొకుండా తాలిబన్‌ నిషేధం విధించింది. ఆ దేశంలోని రెండు ప్రావిన్స్‌లలో ఈ మేరకు నిషేధ ఆజ్ఞలను జారీ చేసింది.  ఈశాన్య ప్రాంతమైన తఖర్, ఉత్తర ప్రాంతమైన బగ్లాన్ ప్రావిన్సులలో శుక్రవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను తాలిబన్‌ అధికారులు జారీ చేశారు. 
ఈద్-ఉల్-ఫితర్ రోజున మహిళలు గుంపులుగా బయటకు వెళ్లడాన్ని నిషేధించినట్లు అందులో పేర్కొన్నారు.  అలాగే తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హిబతుల్లా అఖుంద్జాదా పేరును ఈద్‌ ప్రార్థనల్లో తప్పనిసరిగా ప్రస్తావించాలని ఆదేశించారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఖామా న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని పేర్కొంది. అలాగే దీనికి సంబంధించిన ఉత్తర్వు ప్రతిని ఒక జర్నలిస్ట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.
 
కాగా, 2021 ఆగస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా సైనిక దళాలు వైదొలగిన నేపథ్యంలో సాయుధ తాలిబన్లు మెరుపు వేగంతో రాజధాని కాబుల్‌లోకి ప్రవేశించారు. ఇస్లామిక్‌ స్టేట్‌గా ప్రకటించి మరోసారి పాలనాపగ్గాలు చేపట్టిన తాలిబన్లు ఆ దేశ ముస్లిం మహిళలపై పలు ఆంక్షలు విధించారు. మహిళల స్వేచ్ఛను హరించారు. వారు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశించారు.
 
బాలికలు, యువతులను కాలేజీ, యూనివర్సిటీ విద్యకు దూరం చేశారు. మగవారి తోడు లేకుండా మహిళలు ఒంటరిగా ప్రయాణించడం, బహిరంగ ప్రాంతాల్లో తిరుగడాన్ని నిషేధించారు. అలాగే జిమ్స్‌, పార్కులతోపాటు గార్డెన్‌ రెస్టారెంట్లను మహిళలు సందర్శించకూడదని తాజాగా ఆంక్షలు విధించారు.