కేంద్రంలో `లంగిడీ’ ప్రభుత్వం ఏర్పాటుకై చూస్తున్నారు!

దేశంలో మోదీ నాయకత్వంలో నీతివంతమైన పాలన కొనసాగుతుంటే కేసీఆర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, నితీష్ తో కలిసి లంగిడీ(వికలాంగ) సర్కార్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు.

బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు  బీజేపీలో చేరిన వారిని బుధవారం సాయంత్రం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ కేసీఆర్ నవంబర్ లో తెలంగాణలో రిటైర్డ్ (ఓడిపోతున్నారనే భావన) కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తన భవిష్యత్తు కోసం  ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేతో చేతులు కలిపి పనిచేస్తున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి మాత్రం పాదయాత్రతో తెలంగాణలో చేసేదేముంది? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందంపై ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అతి త్వరలోనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవులను వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉండక తప్పదని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరి ప్రజా తీర్పును వంచించారని గుర్తు చేశారు. ఆ పార్టీకి నీతి, రీతి లేదు. బీజేపీ పార్టీకి నీతితోపాటు సమర్ధవంతమైన నేత ఉన్నారని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. సిద్ధాంతంతోపాటు విజన్ కలిగిన పార్టీ అంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ద్వారా తెలంగాణలోనూ నీతివంతమైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.

కాగా, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, రాజ్యాంగం లేదని,  నయా నిజాం పాలన కొనసాగుతోందని తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం రాజ్యాంగం కంటే తామే పెద్ద అని భావిస్తూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.  కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలంతా భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.   

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఆందోళనలో ఉంటే కేసీఆర్ స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. వారి పక్షాన బండి సంజయ్ ఆధ్వర్యంలో కేటీఆర్ ను బర్తరఫ్ చేసే వరకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ గోబెల్స్ ను మించిన ఘనుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాగడానికి మంచినీళ్లు కూడా అందించలేని కేసీఆర్ అభివ్రుద్ధి గురించి పచ్చి అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా నీళ్లెందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

‘‘జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఒక్కో ఇంటికి రూ.16 వేలు ఖర్చు చేసి ఇంటింటికీ తాగు నీళ్లు అందిస్తుంటే తెలంగాణలో మిషన్ భగీరథ కింద ఒక్కో ఇంటికి రూ.60 వేలు ఖర్చు చేసినా మంచి నీళ్లు ఎందుకు అందించడం లేదు? దీనినిబట్టి మిషన్ భగీరథ ఎంత పెద్ద స్కామో ఆలోచించండి’’అని కోరారు.

బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం పార్టీ నేతలు బీజేపీ చేరడం పట్ల సంజయ్ సంతోషం ప్రకటించారు. రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన కొనసాగుతుందో  బాన్సువాడలోనూ కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.

అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు పాల్గొని ప్రారంభోత్సవాలు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని సంజయ్ విమర్శించారు. అన్నింట్లో కమీషన్లే అని ఆరోపించారు. గతంలో స్టేషనరీ కుంభకోణంలో అడ్డంగా దొరికి కేబినెట్ నుండి బర్తరఫ్ అయిన వ్యక్తికి రాజ్యాంగ బద్ద పదవులిస్తే ఇట్లనే ఉంటుందని ఎద్దేవా చేశారు.