పైరసీని అడ్డుకునే దిశగా సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు

సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పైరసీని అడ్డుకునే పలు ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఇంటర్నెట్లో విచ్చలవిడిగా ప్రసారం అవుతున్న పైరసీ ఫిల్మ్ కంటెంట్ ను అడ్డుకునేలా పలు ప్రతిపాదనలను ఈ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లులో పొందుపర్చారు.

కేంద్ర కేబినెట్ సమావేశం వివరాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. రానున్న సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడ్తామని తెలిపారు. బిల్లులోని పూర్తి వివరాలను వెల్లడించడానికి ఠాకూర్ నిరాకరించారు. సభలో ప్రవేశపెట్టిన తరువాత ఆ వివరాలు అందరికీ లభిస్తాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం సినిమాల వీక్షణ అర్హతకు సంబంధించి ఉన్న ‘యు’, ‘ఎ’, ‘యుఎ’. `ఎస్’ లకు బదులు వయస్సుల వారీ వర్గీకరణను ప్రారంభించే ప్రతిపాదనను కూడా తాజా సవరణ బిల్లులో పొందుపర్చామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. బిల్లులో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం కొత్త వర్గీకరణ “యుఎ-7 “, “యుఎ-13 “, “యుఎ-16 ” తరహాలో ఉండనుంది.

 ప్రస్తుతం అమల్లో ఉన్న వర్గీకరణ ప్రకారం ‘యుఎ’ అంటే 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని అర్థం. కొత్తగా కేబినెట్ ఆమోదం పొందిన బిల్లు ప్రకారం “యుఎ-7 అంటే ఏడేళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని, “యుఎ-13 ” అంటే ” 13 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని, “యుఎ-16 ” అంటే 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని అర్థం.

సినిమాకు సంబంధించిన అన్ని వర్గాలతో చర్చించి, వారి సలహాలు సూచనలు స్వీకరించి ఈ సవరణ బిల్లును రూపొందించామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ బిల్లులోని ప్రతిపాదనలు అందరికీ నచ్చుతాయని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలోని పలు అనవసర ప్రతిపాదలను కొత్త బిల్లులో తొలగించామని వెల్లడించారు.

ఈ కొత్త సవరణలతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీ బి ఎఫ్ సి)కు సినిమాలను సర్టిఫై చేసే ప్రక్రియను మరింత సులభం అవుతుందని చెప్పారు. ఓటీటీ కంటెంట్‌తో పాటు సినిమాలకు ఒకే రకంగా సర్టిఫై చేయోచ్చని, సినిమాలను వర్గీకరించడంలో ఏకరూపతను తీసుకురావడానికి కూడా సవరణలు ఉపయోగపడుతాయని వివరించారు.

క్వాంటమ్‌ మిషన్‌కు ఆమోదం

కేంద్ర మంత్రివర్గం బుధవారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు ఆమోదం తెలిపింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2023-24 నుంచి 2030-31 వరకు ఈ పథకం కింద రూ.6,035.65 కోట్లను కేటాయించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

ఈ మిషన్‌ కింద రాబోయే ఎనిమిదేండ్లలో 50-1000 ఫిజికల్‌ క్యూబిట్‌ల మధ్యంతర స్థాయి క్వాంటమ్‌ కంప్యూటర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ మిషన్‌ ద్వారా కమ్యూనికేషన్‌, ఆరోగ్యం, ఎనర్జీ రంగాలతో పాటు ఔషధాలు, డిజైన్‌, స్పేస్‌ రంగాలకు అనూహ్యమైన ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.

అటామిక్‌ సిస్టమ్‌, అటామిక్‌ క్లాక్‌లలో కచ్చితమైన కాలసూచిక, కమ్యూనికేషన్‌, నావిగేషన్‌కు అవసరమయ్యే మాగ్నోమీటర్లను కూడా ఈ మిషన్‌ కింద అభివృద్ధి చేస్తారు. ప్రపంచంలోనే క్వాంటమ్‌ సాంకేతికత కలిగిన ఏడో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. ఇక నుంచి జంతువులకు సంతాన నిరోధ విధానాన్ని అమలు చేసేలా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొన్నది.