కర్ణాటకలో బీజేపీ బ్రహ్మాస్త్రంగా మోదీ, యోగి ప్రచారం

దక్షిణాదిన గల తమ ఏకైక ప్రభుత్వంను కర్ణాటకలో కాపాడుకొనేందుకు బీజేపీ భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నది. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఇప్పుడు ప్రచారంపై దృష్టి సారిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి బ్రహ్మాస్త్రంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వస్తారని బీజేపీ చెబుతోంది.

కర్ణాటకలో గత 40 ఏళ్లలో అధికార పార్టీ విజయం సాధించలేదు. దానికి తోడుగా కొన్ని సర్వేలు సహితం సానుకూలంగా ఉండడంతో తాము అధికారంలోకి రావడం పట్ల కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే, తాము కాంగ్రెస్‌ కంటే కనీసం 10 సీట్లతో ఆధిక్యంలోకి వస్తామని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయని రాష్ట్ర  బీజేపీ వర్గాలు భరోసా వ్యక్తం చేస్తున్నాయి.

తమ ప్రచారం ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని, ఏప్రిల్ చివరి వారం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడంతో పరిస్థితులు పూర్తిగా బిజెపికి సానుకూలంగా మారగలవని అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్ చేస్తున్న కమీషన్ల ప్రభుత్వం, పేసీఎం,  ఉచితాల ప్రచారానికి ప్రధానమంత్రి గట్టి కౌంటర్ ఇస్తారని బిజెపి నాయకులు ధీమాగా ఉన్నారు. 2014కు ముందు జరిగిన కాంగ్రెస్ అవినీతి చరిత్రపై మోదీ దూకుడుగా దాడి చేయగలరని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విజయాల తర్వాత వాగ్దానాలను అమలు చేయని కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్‌ను బహిర్గతం చేస్తామని చెబుతున్నారు.

మహిళలకు రూ.2000 భృతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి నాలుగు హామీలను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. ఇందుకు పోటీగా తమ ప్రభుత్వ హయాంలో డబుల్ ఇంజన్ అభివృద్ధి, రాష్ట్రానికి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాల గురించి ప్రధాని ఓటర్లకు గుర్తు చేస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.

ప్రచారంలో కాంగ్రెస్‌ను వెనుకకు నెట్టడానికి తమవద్ద అనేక అస్త్రాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రచారంలో 4% ముస్లిం రిజర్వేషన్ అంశం, మోదీ తేరీ కబర్ ఖుదేగీ అనే కాంగ్రెస్ వ్యాఖ్య కూడా ప్రధానంగా ఉంటాయని చెబుతున్నారు.

దీంట్లో మొదటి అంశం కాంగ్రెస్ ముస్లింల బుజ్జగింపు విధానాన్ని హైలైట్ చేస్తుందని, రెండోది ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మరణాన్ని కోరుకుంటున్నట్లు చెప్పడానికి మోదీ లేవనెత్తుతారని భావిస్తున్నారు. ఎన్నికలలో ఇప్పటివరకు స్థానిక సమస్యలే కేంద్రీకృతంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ఈ ప్రయత్నం చేయనుంది.

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అనేక కేంద్ర పథకాల ప్రయోజనాలను అందిపుచ్చుకుంటోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు నష్టపోతారని బీజేపీ నేతలు హెచ్చరించేందుకు సిద్ధపడుతున్నరు. “కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6,000 పంపుతుండగా, కర్ణాటక  ప్రభుత్వం దానికి మరో రూ.4,000 జోడించి రైతులకు అందిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ నిధుల పరిస్థితి ఏంటి?” అనే ప్రశ్నను బిజెపి లేవనెత్తుతుంది.
 
ఈ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ చెబుతుండగా, రాష్ట్రంలో సామాజిక సమీకరణాలతో తాము గట్టి పోటీ ఇవ్వగలమని బీజేపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. పలువురు సీనియర్ నాయకులు బిజెపిని వీడడంతో కాంగ్రెస్ పెంచుకున్న ఆశలు నీటిబుడగలుగా మారుతాయని బిజెపి భావిస్తున్నది.

జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవాది వంటి నాయకులూ తమ స్థాయికి మించి ఊహించుకుంటున్నారని, కనీసం వారి స్థానాలను కూడా ఇద్దరూ గెలుచుకునే అవకాశం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. “కర్ణాటకలో బీజేపీ గెలుస్తుందని షెట్టర్‌కు కూడా తెలుసు. అందుకే తన సీటు గెలిస్తే బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలుస్తానని భావించి తన కుమారుడికి కూడా టికెట్ కోరలేదు. సీనియర్ లింగాయత్ నాయకుడిగా బసవరాజ్ బొమ్మైకి సవాలు విసరగలడని ఆయనకు తెలుసు. బీజేపీ ఈ ఉచ్చులో పడలేదు” అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

లక్ష్మణ్ బీజేపీకి వచ్చిన తర్వాత 2018 ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. అయితే పార్టీ ఆయన్ను ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా చేసింది. పార్టీ మళ్లీ ఆయనకు టికెట్ ఇచ్చి, ఈ తప్పును పునరావృతం చేస్తుందని లక్ష్మణ్ భావించారు.

ముందస్తుగా ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్, టిక్కెట్ల కేటాయింపును ఎందుకు ఆలస్యం చేసింది? తామే గెలుస్తామని చెప్పుకునే ఆ పార్టీ.. ఈ పని ముందే చేసి ఉండాల్సిందని బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పోటీకి సారైన అభ్యర్థులు లేక, బీజేపీలో సీట్ దొరకక వచ్చినవారిని ఆలింగనం చేసుకొనేందుకు ఎదురు చూసారని ధ్వజమెత్తారు.

బెంగుళూరు వెలుపల బిజెపి టికెట్లు ఇచ్చిన వారిలో 74 మంది మొదటిసారి పోటీ చేస్తున్నవారేనని, ఇది జనరేషనల్ మార్పుకు దారితీసిందని బిజెపి నేతలు భావిస్తున్నారు.