డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలోనూ ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.  జూబ్లీహిల్స్‌లోని యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్‌లతో సహా మైత్రీ మూవీ మేకర్స్, వారి ప్రమోటర్ల ఆఫీసుల్లో అధికారులు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు.

జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, ఐటీ రిటర్న్‌లలో తప్పుడు వివరాలను అందించినందుకు గాను సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలను నిర్మాణ యూనిట్ల కొనుగోలు, వాటికి సంబంధించిన పన్నులపై ఐటీ రిటర్న్ లలో నిబంధనలను ఉల్లంఘించారని అధికారులు తేల్చారు.  గత ఏడాది జీఎస్‌టీ రిటర్న్‌లను ధృవీకరించిన ఐటీ శాఖ అధికారులు..వారి ఆడిటర్లను ప్రశ్నించారు.

హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ద్వారా ప్రమోటర్లు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ సోదాలు చేస్తోంది. ప్రమోటర్లు విదేశాల్లో వ్యాపార సంబంధాలు కలిగిన ఎన్‌ఆర్‌ఐలుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి  2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు తీస్తోన్నట్లు తెలిసింది.

టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నారు.  పుష్ప 2 సినిమాను రూ. 500 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు, ఈ మధ్య పలు సినిమాలను కూడా నిర్మించారు. పుష్ప 2 సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్  ఏకంగా రూ. 100  కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.