జగన్ ఏపీకి సీఎం కావడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యం

జగన్  ఏపీకి సీఎం కావడం అక్కడి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని  బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఘాటుగా విమర్శించారు. జగన్ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటుండని పేర్కొంటూ ఏడుకొండలవాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదని ఆయన హెచ్చరించారు.

జగన్ నాశనమైపోతారని… ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్సీపీ ఉండదని స్పష్టం చేశారు. టీటీడీలో అన్యమతస్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారని, కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారని దియోధర్ ఆరోపించారు. గత కొన్ని రోజుల ముందు  టీటీడీ ఇచ్చిన  నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండు రోజుల్లో  నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళనలు చేస్తామని దియోధర్ హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంకు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకన్న వైఎస్సార్సీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేస్తూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందని దియోధర్ తెలిపారు. వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్ట్ చేయటం ద్వారా బీజేపీ – వైసీపీ మధ్య ఎటువంటి సంబంధాలు లేవనే విషయం స్పష్టమైందని తెలిపారు.

జగన్ తప్పు చేసి ఉంటే ఆయన కూడా జైలుకెళ్లక తప్పదని బిజెపి నేత స్పష్టం చేశారు. వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్న ఆయన వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైంది కాదని ధ్వజమెత్తారు.  ఆధారాలున్నాయి కాబట్టే నిందితులను  అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు.