లండన్‌ బీచ్‌లో హైదరాబాద్‌ విద్యార్థిని మృతి

లండన్‌లోని ఓ బీచ్‌లో హైదరాబాద్ కు చెందిన విద్యార్థిని మృతి చెందింది.  సైదాబాద్  లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన కె.శశిధర్‌ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆరు నెలల కిందట లండన్‌కు వెళ్లింది.  యూకేలోని క్రాన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్‌, స్పెస్‌ మాస్టర్‌ డిగ్రీ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించడానికి వెళ్లింది. అయితే ఈనెల 11వ తేదీన బ్రైటన్‌ బీచ్‌లో ఆమె నీటి అలల్లో చిక్కుకొని ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో అక్కడి పోలీసులు విచారణ చేపట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,”ఏప్రిల్ 11న బ్రైటన్ బీచ్ వద్ద సముద్రపు అలలలో చిక్కుకుని మృతి చెందిందని , అప్పటి నుండి ఆమె మృతదేహం స్థానిక ఆసుపత్రిలోనే ఉందని తెలిపారు. సాయి తేజస్విని లాంగ్ వీకెండ్ కి వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సాయి తేజస్విని మృతిపై అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు”.

సాయి తేజస్వినితో పాటు ఎవరెవరు ఉన్నారని , ఆమెకు ఈత రాదా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గారాల కూతురు ఇలా హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సాయి తేజస్విని మృతదేహాన్ని భారత్ కు తీసుకుని రావడానికి సహకరించాలని కోరుతూ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కుటుంబసభ్యులు ట్విట్టర్‌ ద్వారా కోరడంతో స్పందించిన మంత్రి జరిగిన నష్టానికి చింతిస్తున్నామని స్పందించారు. కేటీఆర్ కార్యాలయ సిబ్బంది స్థానిక బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ను కలిసి వెంటనే సహాయం చేస్తుందని రీట్వీట్‌ చేశారు.

అదే విధంగా సాయి తేజస్విని సోదరి ప్రియా రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ సాయి తేజస్విని మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటుందని ట్వీట్‌ చేశారు.

సాయి తేజస్విని రెడ్డి మృతదేహం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంటుందని, అదే రోజు రాత్రికి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేస్తున్నారని బీజేపీ ఐఎస్‌ సదన్‌ డివిజన్‌కు చెందిన భాగ్యనగర్‌ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర బాబు తెలిపారు. శనివారం ఉదయం చంపాపేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు.