ధర్మపురి స్ట్రాంగ్‌రూమ్ సీల్ పగలగొట్టండి

జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.  ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ సీల్  పగలగొట్టాలని  జిల్లా కలెక్టర్ కు హైకోర్టు అనుమతిచ్చింది.  మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ  సందర్భంగా.. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరవాలని కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.

రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చింది. అవసరమైతే వడ్రంగి, లాక్ స్మిత్ సహకారం తీసుకునేందుకు అనుమతిచ్చింది. స్ట్రాంగ్ రూం తాళాల గ్లలంతుపై ముగ్గురు అధికారులతో విచారణ జరిపిస్తున్నామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 24కి వాయిదా వేసింది కోర్టు.

2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు  జరిగాయని, ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ (ప్రస్తుతం మంత్రి) ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు తారుమరయ్యాయని పేర్కొంటూ రీ కౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించిన అడ్లూరి మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.  అడ్లూరి పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల ఫలితాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి అప్పటి ఎన్నికకు సంబంధించిన 17ఎ,17సి డాక్యుమెంట్ కాపీలను, సీసీ పుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్స్ ను ఏప్రిల్ 11వ తేదీన సమర్పించాలని రిటర్నింగ్ అధికారి భిక్షపతికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏప్రిల్ 10న అధికారులు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఈవీఎంల స్ట్రాంగ్ రూం తెరవడానికి వెళ్లగా కీ మిస్ అయ్యిందని చెప్పారు. దీనిపై  జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వగా ఇప్పుడు విచారణ జరిపిన హైకోర్టు స్ట్రాంగ్ రూం పగలగొట్టి తెరవాలని ఆదేశించింది.