అయోధ్య శ్రీరాముని రూపురేఖల నిర్ణయం

అయోధ్యలో అత్యంత వైభవోపేతంగా నిర్మితమవుతున్న రామాలయంలో రాముని విగ్రహం రూపు రేఖలు ఏ విధంగా రూపొందించాలో శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. కర్ణాటక నుంచి సేకరించిన కృష్ణ శిలతో కోదండపాణి రూపంలో శ్రీరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఐదు అడుగుల ఎత్తులో ఈ విగ్రహం మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేస్తారు.

రాముడు ఐదేళ్ల వయసులో విల్లు, అమ్ములు ధరించి కోదండపాణిలా నిలుచుని ఉన్నట్టు రూపురేఖలు ఉంటాయి. మంగళవారం రాత్రితో ముగిసిన రెండు రోజుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ ట్రస్ట్ సభ్యుడు స్వామి తీర్థ ప్రసన్నాచార్య ఓ వార్తా సంస్థకు ఈ వివరాలను తెలిపారు. కర్ణాటకలోని కార్కర్, హెగ్గె దేవెన్ కోటే గ్రామాల నుంచి అయోధ్యకు తీసుకెళ్లిన శిలలలో ఒక శిలను శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంపిక చేసి, శ్రీరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దుతారని స్వామి తీర్థ ప్రసన్నాచార్య తెలిపారు.

ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, సాధు, సంతులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, శిల్పులు, హిందూ గ్రంథాల నిపుణులు, ట్రస్ట్ సభ్యులతో విస్తృతంగా సంప్రదించిన తర్వాత కృష్ణ శిలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి పండుగనాడు అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే శ్రీరాముని విగ్రహం కోసం భక్తులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని తెలిపారు.

ఇదిలావుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  2020 ఆగస్టులో రామాలయానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రామాలయం 2024 జనవరినాటికి అందుబాటులోకి వస్తుందని ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.