ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

మావోయిస్టుల సంబంధాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం పక్కన పెట్టింది. మళ్లీ ఈ కేసుపై విచారణ జరిపి నాలుగు నెలల్లో తాజా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులను తిప్పి పంపింది.

సాయిబాబా, మరో నిందితుడి అప్పీలును అదే ధర్మాసనానికి కాక వేరే ధర్మాసనానికి అప్పగించాలని బాంబే హైకోర్టును జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. యుఎపిఎ చట్టంపై నిర్ణయాధికారం హైకోర్టు పరిధిలో ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసులో సాయిబాబాను, ఇతరులను విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గత ఏడాది అక్టోబర్ 15న సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్, సాయిబాబా తరఫున న్యాయవాది ఆర్ బసంత్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

2014లో అరెస్టయిన సాయిబాబాను ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బాంబే హైకోర్టు అక్టోబర్ 14న ప్రకటిస్తూ జైలు నుంచి ఆయన విడుదలకు ఆదేశాలు జారీచేసింది. యుఎపిఎకు చెందిన కఠిన సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

యుఎపిఎ, ఐపిసి సెక్షన్ల కింద నేరానికి పాల్పడ్డారని స్థానిక కోర్టు నిర్ధారిస్తూ 2017లో సాయిబాబాతోపాటు ఇతరులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఎదుట అప్పీలు చేసుకున్నారు.

సాయిబాబాతోపాటు యావజ్జీవ కారాగార శిక్ష పొందిన మషేష్ కరిమాన్ తిర్కి, పాండు పోరా నరోతె(ఇద్దరూ రైతులు), హేమ్ కేశవదత్త మిశ్రా(విద్యార్థి), ప్రశాంత్ సంగ్లికర్(జర్నలిస్టు), 10 సంవత్సరాల కారాగార శిక్ష పొందిన విజయ్ తిర్కి(కార్మికుడు)లను నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టు గత ఏడాది అక్టోబర్‌లో తీర్పు చెప్పింది. అప్పీలు పెండింగ్‌లో ఉండగానే నరోతె మరణించారు.