ఐఎస్ఐ, లష్కరేతో అతీక్కు లింక్

ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో శనివారం రాత్రి టీవీ లైవ్​లో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ల​కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

ఉగ్రవాదుల నుంచి తాను ఆయుధాలను కొన్నానని విచారణలో ఇదివరకే అతీక్ అంగీకరించాడని ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. ‘‘ఐఎస్ఐ డ్రోన్ల ద్వారా ఆయుధాలను పంజాబ్​లో జారవిడిచేది. ఆ ఆయుధాలను కొందరు ఐఎస్ఐతో లింకులు ఉన్న వ్యక్తులు సేకరించి, లష్కరేకు, ఖలిస్తాన్  వేర్పాటువాద సంస్థలకు అందజేసేవారు. వారి నుంచి తాను పిస్టల్, ఏకే 47, ఆర్డీఎక్స్ కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాను” అని అతీక్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఆ ఆయుధాలతోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు సాక్షి ఉమేశ్ పాల్ ను, ఇద్దరు పోలీసులను హత్య చేసినట్లు వెల్లడించాడని పేర్కొన్నారు. ఐఎస్ఐ, లష్కరేకు చెందిన వ్యక్తులు తన వద్దకు కూడా వచ్చేవారని, వాళ్లు ఎక్కడున్నారో తెలుసని.. దేశంలో భారీ విధ్వంసానికి వారు కుట్ర చేసినట్లు కూడా చెప్పినట్లు వివరించారు.

అయితే, యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అతీక్ అహ్మద్ రెండు వారాల కిందటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరణకు గురయింది. రెండు వారాల్లోగా జైలులో నుంచి బయటకు తీసుకెళ్లి తమను చంపేస్తారంటూ ఓ పోలీస్ అధికారి చెప్పాడని ఇటీవల అతీక్ మీడియాతో చెప్పిన వీడియో కూడా తాజాగా వైరల్ అయింది.     

అతీక్, అష్రఫ్ హత్యతో ప్రయాగ్ రాజ్ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రయాగ్ రాజ్ లో పోలీసులు ఆదివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు. అండర్ వరల్డ్ లో ఫేమస్ కావాలనే అతీక్, అతడి సోదరుడిని చంపామని నిందితులు లవ్లేశ్ తివారి (22), సన్నీ (23), అరుణ్ మౌర్య(18) విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు ముగ్గురూ తమ కుటుంబాల నుంచి దూరంగా ఉంటూ క్రిమినల్ కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 17 మంది పోలీసులను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్​ను నియమించింది.