అవార్డుల వేడుకలో వడదెబ్బకు 11 మంది మృతి

మహారాష్ట్ర భూషణ్‌-2022 అవార్డు ప్రదానోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఎండ వేడిమి భరించలేక 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 50 మంది వడదెబ్బకు గురయ్యారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవీ ముంబయిలో మహారాష్ట్ర భూషణ్‌-2022 అవార్డు ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్‌కు అవార్డును ప్రదానం చేశారు. అవార్డు ప్రధానోత్సవం వరకు అంతా బాగానే ఉంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వేలాది మంది తరలివెళ్లారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఈవెంట్​.. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అప్పుడు నవీ ముంబైలో ఉష్ణోగ్రత 39 డిగ్రీలు.

అయితే,  పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవ్వడంతో వేలాది మంది.బహిరంగ ప్రదేశంలో ఎటువంటి నీడ లేని ప్రాంతంలో, గంటల తరబడి కూర్చుండిపోవడంతో వేడి భరించలేక ప్రాణాలు కోల్పోయారు. అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన వారికోసం సిట్టింగ్‌ ఏర్పాట్లు చేసినప్పటికీ  పైకప్పు లేకపోవడంతో ఎండ తీవ్రతను భరించలేకపోయారు.

ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఎకనాథ్  శిందే ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇదొక్క దురదృష్టకర సంఘటన అని చెబుతూ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

ఇలా ఉండగా, ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యాసంస్థలకు వారం రోజులు సెలవులు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏప్రిల్‌ 17 నుండి ఏప్రిల్‌ 22 వరకు మూసివేస్తారు. గత కొన్ని రోజులుగా పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తలనొప్పి , ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ఆమె కోరారు.