విద్యుత్ వినియోగంలో 9.5 శాతం వృద్ధి

2022-23లో దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం 9.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం విద్యుత్‌ వినియోగం 1,503.65 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. కరోనా అనంతరం దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం వల్ల విద్యుత్‌ డిమాండ్ పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ద్వారా తెలుస్తున్నది.  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) విద్యుత్ సరఫరా డేటా ప్రకారం, 2021-22లో విద్యుత్ వినియోగం 1,374.02 బిలియన్ యూనిట్లుగా (బీయూ) ఉంది.
గరిష్ట విద్యుత్ డిమాండ్ లేదా ఒక రోజులో అత్యధిక సరఫరా కూడా 207.23 గిగావాట్లకు పెరిగింది. 2021-22లో నమోదైన 200.53 గిగావాట్ల కంటే కూడా ఇది ఎక్కువ. కాగా, 2023-24లో విద్యుత్ వినియోగం, డిమాండ్ గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఆ మేరకు బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు బ్లెండింగ్ కోసం బొగ్గును దిగుమతి చేసుకోవాలని దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లకు సూచించింది.

మరోవైపు ఈ ఏడాది మార్చిలో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్ వినియోగంపై వర్షాల ప్రభావం పడింది. గతంతో పోల్చితే ఈ ఏడాది మార్చిలో విద్యుత్ వినియోగం 128.47 బిలియన్ యూనిట్లు (బీయూ) నుంచి 126.21 బిలియన్‌ యూనిట్లకు పడిపోయింది.  అయితే 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు విద్యుత్ వినియోగం 1,377.43 బిలియన్‌ యూనిట్లు (బీయూ). 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 1,374.02 బిలియన్‌ యూనిట్ల (బీయూ) కంటే ఇది ఎక్కువ.

కాగా, ఈ ఏడాది మార్చిలో వర్షాలు లేకపోతే విద్యుత్‌ వినియోగం గత ఆర్థిక సంవత్సరం కంటే మరింతగా పెరిగేదని విద్యుత్‌ రంగ నిఫుణులు తెలిపారు. 2023-24లో విద్యుత్‌ వినియోగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు. విద్యుత్ వినియోగం పెరుగడం వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్‌కు డిమాండ్‌ ఏర్పడుతుందని విద్యుత్‌ రంగ నిఫుణులు పేర్కొన్నారు.