జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర

జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర
అత్యంత పవిత్ర యాత్రగా భావించే అమర్ నాథ్ యాత్ర జులై 1 న ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 31న పూర్తవుతుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన తేదీల వివరాలను శుక్రవారం వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
 
జులై 1 నుంచి 62 రోజుల పాటు ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 17 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. రెండు మార్గాల నుంచి ఈ యాత్ర జరుగుతుంది. ఒకటి అనంత్ నాగ్ జిల్లాలోని పహల్ గావ్ మార్గం, కాగా, మరొకటి గండేర్ బల్ జిల్లాలోని బల్తాల్ మార్గం.
 
శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డ్ కూడా ఈ సంవత్సరం ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం నిర్వహించే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీ అమర్ నాథ్ యాత్ర యాప్ ను ఆసక్తి కలిగిన భక్తులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా యాత్రకు సంబంధించిన తాజా వివరాలు, వాతావరణ పరిస్థితులు తెలుసుకోవచ్చు.
 
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఉద్దేశ్యమని మనోజ్ సిన్హా తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు సూచించారని ఆయన చెప్పారు. అమర్ నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సురక్షిత యాత్ర అనుభవం కల్పించాలన్నది తమ ఉద్దేశమని మనోజ్ సిన్హా తెలిపారు.
 
యాత్ర మార్గంలో వైద్య సదుపాయాలు, టెలీకాం సేవలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. యాత్ర ప్రారంభం కావడానికి ముందే ఆ మార్గంలో టెలీకాం సేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర విజయవంతంగా పూర్తి కావడం కోసం సంబంధిత వర్గాలన్నింటినీ సమన్వయం చేస్తామని చెప్పారు. పోలీస్, విద్యుత్, వసతి, తాగు నీరు, పారిశుద్ధ్యం, భద్రత.. తదితర సేవలను భక్తులు నిరంతరాయంగా పొందేలా చూస్తామని జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు.