గ్యాంగ్​స్టర్​ అతీక్ అహ్మద్, సోదరుడు​​ దారుణ హత్య

ఉత్తర్​ ప్రదేశ్​లో వందకుపైగా క్రిమినల్​ కేసులు ఉండి, పోలీసుల  ఎన్‌కౌంటర్‌లో 48 గంటల క్రితం కొడుకుని కోల్పోయిన గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ శనివారం రాత్రి అనూహ్య రీతిలో హత్యకు గురయ్యారు. ప్రయాగ్​రాజ్​లో  వైద్య పరీక్షల కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తీసుకెళ్తోన్న వీరిపై
 
జర్నలిస్ట్ ముసుగులో వచ్చిన దుండగులు దగ్గర నుంచి కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులకు జరపడంతో సోదరులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు షూటర్లు సహా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్, జర్నలిస్ట్‌కు గాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అతీక్​ అహ్మద్​, అతడి సోదరులను ఆసుపత్రికి తీసుకెళుతుండగా  కొందరు జర్నలిస్టులు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అతీక్​ అహ్మద్​ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. జర్నలిస్టు ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి తుపాకీతో తొలుత గ్యాంగ్​స్టర్​పై దాడి చేసి చంపేశాడు.

ఆ తర్వాత అతడి సోదరుడిని టార్గెట్​ చేశాడు. మరో ఇద్దరు తుపాకీలతో పలుమార్లు తూటాలను వారి శరీరాల్లోకి దింపారు. ఈ దృశ్యాలు మీడియా కెమెరాల్లో చిక్కాయి. పోలీసులు వారిని పట్టుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 22 సెకెన్లలో 14 రౌండర్లు కాల్పులు జరిపారు. ఘటనా స్థలిలో మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అతీక్​ అహ్మద్​ హత్య నేపథ్యంలో ఉత్తర్​ ప్రదేశ్​ ఉలిక్కిపడింది.  ఘటన జరిగిన ప్రయాగ్​రాజ్​లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించి.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను తరలించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని ఎసిఎస్ (హోమ్), డీజీపీలకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించినట్లు ప్రత్యేక డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

 
 ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన యూపీ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్​ అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పూర్తి వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.