బారాముల్లాలో ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదుల అరెస్ట్‌

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం టెర్రర్‌ మాడ్యూల్‌ను ఛేదించారు. భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైతం అరెస్టు చేశారు. వారిని ఫరూఖ్‌ అహ్మద్‌ పర్రా, సైమా బషీర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
 
పక్కాగా అందిన సమాచారం మేరకు బారాముల్లా పోలీస్‌, ఆర్మీ 29ఆర్‌ఆర్‌, 2బీఎన్‌ ఎస్‌ఎస్‌బీ బలగాలు బారాముల్లా పట్టాన్‌ వద్ద టెర్రర్‌ మాడ్యుల్‌ను చేధించాయి. అదే సమయంలో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  అలాగే ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
 
ఒక పిస్టల్‌, రెండు పిస్టల్ మ్యాగజైన్‌లు, ఐదు పిస్టల్ రౌండ్లు, పేలుడు పరికరాలు, 2 కిలోల బరువున్న ఒక రిమోట్ కంట్రోల్ ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ఇద్దరు అబిద్‌ ఖయూమ్‌ లోన్‌ అనే టెర్రరిస్ట్‌తో సన్నిహితంగా పని చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఇద్దరిపై పట్టాన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.