తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులకు `సుప్రీం’ అనుమతి!

తమిళనాడు రాష్ట్రమంతటా రూట్ మార్చ్ నిర్వహించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సవాలుచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వినతిని కొట్టివేసింది.  న్యాయమూర్తి వి.రామసుబ్రణ్యన్ నేతృత్వంలోని ధర్మాసనం ‘అన్ని స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేశాము’ అన్న ఏక వాక్యంతో తీర్పు వెలువడింది. తీర్పుకు సంబంధించిన వివరాలు ఇంకా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కావలసి ఉంది.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావడం, గాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించాలని గత ఏడాది అక్టోబర్‌లో తమిళనాడు ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ కోరింది. అయితే, నిషేధిత ‘పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా’ నుంచి దాడుల ముప్పు ఉందంటూ ఈ ర్యాలీలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో మద్రాసు హైకోర్టును ఆర్ఎస్ఎస్ ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో కొన్ని షరతులపై ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై కూడా ఆర్ఎస్ఎస్ డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఎలాంటి షరతులు లేకుండా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ డివిజన్ బెంచ్ ఈ ఏడాది ఫ్రిబవరి 10న తీర్పు చెప్పింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ర్యాలీలను పూర్తిగా తాము వ్యతిరేకించడం లేదని, నిఘావర్గాల హెచ్చరికలతోనే వీధివీధిన ర్యాలీలకు అనుమతించడం లేదని చెప్పింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. మద్రాసు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ స్టాలిన్ సర్కార్ పిటిషన్‌ను మంగళవారంనాడు కొట్టివేసింది. దీంతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహ్తాగి వాదిస్తూ ఒకే రోజున 50 చోట్ల రూట్ మార్చ్ లకు అనుమతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వంకు శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. అందుకనే ఐదు ప్రదేశాలను ప్రతిపాదిస్తున్న ట్లు తెలిపారు.

విచారణ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేశ్ జెఠ్మాలనీ తన వాదన వినిపిస్తూ బలమైన కారణాలు లేనప్పుడు రూట్ మార్చ్ నిర్వహించుకోవడానికి హక్కు ఉందని తెలిపారు. పైగా, మైదానంలోనే రూట్ మార్చ్ లను నిర్వహించుకోమనడంలో అర్థం లేదని అంటూ వాటిని ప్రజలు చూడటం కోసం నిర్వహిస్తారని గుర్తు చేశారు.

తమిళనాడులో ఒకవేళ ఉగ్రవాద సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు ముప్పు కలిగించేట్టయితే రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకొని కూర్చోకూడదని వాదించారు. ప్రభుత్వం చూపుతున్న హింసాయుత సంఘటనలు ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ ల సందర్భంగా జరిగినవి కావని, పైగా ఆ సంఘటనలలో ఆర్ఎస్ఎస్ సభ్యులే బాధితుల్ని ఆయన గుర్తు చేశారు.