అరుణాచల్ పర్యటనపై చైనా కన్నెర్ర… అమిత్ షా హెచ్చరిక

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నుండి రెండు రోజులపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల చైనా తప్పుబట్టింది. అమిత్ షా పర్యటన ఆ ప్రాంతంపై చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఒక వంక, చైనా అభ్యంతరాన్ని భారత్ కొట్టిపారవేయగా, మరోవంక భారతదేశానికి చెందిన సూదిమొనంత భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం కూడా ఎవరూ చేయలేరని అమిత్ షా హెచ్చరించారు.
 
అరుణాచల్ ప్రదేశ్‌ లోని కిబితూ లో ”వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం” ను సోమవారంనాడు ఆయన ప్రారంభిస్తూ  సరిహద్దులను ఇండో-టిబిటన్ సరిహద్దు పోలీసులు, భారత ఆర్మీ కంటికిరెప్పలా చూసుకుంటున్నాయని, ఈ పరిస్థితిల్లో భారత్‌పై చెడుకన్ను వేసే సాహసం ఎవరూ చేయలేరని స్పష్టం చేశారు.
”దేశ ప్రజలందరూ ఇవాళ ప్రశాంతంగా ఇళ్లలో నిద్రిస్తున్నారంటే అందుకు మన సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాస్తున్న మన ఐటీబీపీ జవాన్లు, ఆర్మీనే కారణం. దుష్టపన్నాగంతో మన భూభాగంపై కన్నేసే సాహసం ఎవరూ చేయలేరు. ఈ విషయాన్ని మనం ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు” అని తెలిపారు.

“జవాన్ల త్యాగాలకు నేను సెల్యూట్ చేస్తున్నారు. 1962లో ఇక్కడ భూమిని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారెవరైతే ఉన్నారో వారు ఇవాళ మీ దేశభక్తి కారణంగా వెనక్కి వెళ్లిపోయారు” అని చైనాను పరోక్షంగా ఉద్దేశించి అమిత్‌షా హెచ్చరించారు.

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ”లుక్ ఈస్ట్ పాలసీ”తో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని, ఇప్పుడు ఆ ప్రాంతాలు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయని హోం మంత్రి చెప్పారు. 2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా కల్లోపిత ప్రాంతంగా ఉండేదని, గత 9 ఏళ్లలో మోదీ తీసుకువచ్చిన లూక్ ఈస్ట్ పాలసీతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోందని చెప్పారు.

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో కిబితూ మొదటి గ్రామమని ఆయన అభివర్ణించారు. ఇది చిట్టచివరి గ్రామం ఎంతమాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలోని చివరి గ్రామాన్ని దర్శిస్తున్నారని తనతో అనేవారని, అయితే ఇవాళ తాను ఒక విషయం చెప్పదలచుకున్నానని, కిబితూ ఎంతమాత్రం చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని పేర్కొన్నారు.

 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.4,800 ఆర్థిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకమైన “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” కు మోదీ సారథ్యంలోని కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఉత్తర సరిహద్దులోని బ్లాకుల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు. తొలి విడతగా 662 గ్రామాలను గుర్తించామని, అందులో 455 గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయని తెలిపారు.

ఇలా ఉండగా, అమిత్ షా  అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై స్పందిస్తూ “జాంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్ పేరు) అనేది చైనా భూభాగం” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు. “ఈ ప్రాంతంలో భారత అధికారుల కార్యకలాపాలు చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇవి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు అనుకూలంగా లేవు. మేము దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాము” అని ఆయన తెలిపారు.

ఇటు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చడాన్ని భారతదేశం గత వారం తిరస్కరించింది. ఆ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, అలాంటి రాష్ట్రంలోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ టిబెట్‌గా చెప్పుకునే అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 11 ప్రదేశాలకు చైనా పేర్లను బీజింగ్ ప్రకటించింది.

 
అయితే, చైనా ఇటువంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని.. తాము దీన్ని తిరస్కరిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. గతంలో చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా మనం తిప్పికొడుతూనే వచ్చామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ అంతర్భాగమని తేల్చి చెప్పారు.
 
చైనా కొత్తగా పేర్లను పెట్టడం ద్వారా ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు. ఇదే అంశంలో అమెరికా సైతం భారత్ కు మద్దతుగా నిలిచింది. చైనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడే కాదు,  అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు స్థలాల పేర్లలో మొదటి ప్రకటనను 2017లో విడుదల చేయగా, రెండోసారి 15 స్థలాలను 2021లో జారీ చేశారు. మే 2020లో ప్రారంభమైన తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాలకు చైనా పేర్లు ప్రకటిస్తూ వస్తోంది.