ఎన్సీపీ, తృణమూల్, సిపిఐల జాతీయ హోదా రద్దు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకుంది. అదే సమయంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమై తృణమూల్ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సిపిఐ) పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకుంది.
 
వాస్తవానికి ఓ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్‌సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లైనా వచ్చి ఉండాలి.  నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. లేదంటే దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాల్లో విజయం సాధించి ఉండాలి. ఈ రెండు శాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా జాతీయ పార్టీగా గుర్తిస్తారు.
 
2019 జులైలో ఎన్‌సిపి, టిఎంసి, సిపిఐ పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో  తమ పనితీరు తర్వాత ఆయా పార్టీల జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ కోరింది. తాజాగా మూడు పార్టీల జాతీయ హోదా రద్దు చేసింది. 
 
అయితే,  కొత్తగా అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 13లోగా ఉత్తర్వులు జారీ చేయాలని గత వారం కర్ణాటక హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఐదు సీట్లు గెలిచింది. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్నది.
 
గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 6.8 శాతం ఓట్లు ఓట్లు దక్కాయి. అదే సమయంలో ఇద్దరు అభ్యర్థులు సైతం గెలుపొందారు. ఈ క్రమంలో పార్టీకి జాతీయ హోదాను కట్టబెట్టింది. దేశంలో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నా కొద్ది పార్టీలకు జాతీయ హోదా ఉన్నది.
 
ఇందులో భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు), నేషనల్ పీపుల్స్ పార్టీ ( ఎన్‌పీపీ) పార్టీకి సైతం జాతీయ హోదా ఉన్నది. ఎన్‌పీపీ పార్టీకి 2019 జూన్‌ 7న జాతీయ హోదా లభించింది.  అలాగే పలు పార్టీలకు ప్రాంతీయ హోదా ఇచ్చింది. ఆరు పార్టీల హోదాను మార్పు చేసింది. 
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్రకటించిన కేసీఆర్‌కు ఈసీ షాకిచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది. బీఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్‌లో ఆర్ ఎల్ డి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్‌లో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి  రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్కు రాష్ట్ర పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. మణిపూర్లో పిడిఎ, పుదుచ్చేరిలో పీఎంకే పార్టీల రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. మరోవైపు మేఘాలయలో వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా కల్పించింది. నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. త్రిపురలో రాష్ట్ర పార్టీగా టిప్ర మోత పార్టీకి గుర్తింపు దక్కింది.