టెన్త్ లీకేజీ అబద్ధం.. లీకేజీకి ఆస్కారమే లేదు

లీకేజీ అబద్ధం అని, లీకేజీకి ఆస్కారమే లేదని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చుని కుట్రలు చేశారని పేర్కొంటూ కుట్రపూరితంగా తన చేతిలోని అధికారులను అడ్డం పెట్టుకొని ఈ విషయమై కేసులు పెట్టారని ఆరోపించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలయితే 11 గంటల తర్వాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారు? అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని ఎలా అయినా తమను ఇరికించాలని కుట్ర పూరితంగా తమపై కేసులు పెట్టించారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ప్రశ్న పత్రాల లీకేజి కేసులు పెడుతున్నారని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ఆరు పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయి కావడంతో జరుగుతున్న ప్రతికూల చర్చ నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ కేసులు పెట్టారని చెప్పారు. సుఖేష్ చంద్రశేఖర్ కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి రేంజ్ రోవర్ కారులో ఇచ్చానని చెప్తుంటే ఆ చర్చ జరగకుండా పక్కదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

లిక్కర్ కేసు పై చర్చ జరగొద్దని, దేశమంతా ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెడతానని కేసీఆర్ చెబుతున్న అంశంపై చర్చ జరగకూడదని ఇదంతా దృష్టి మళ్లించే రాజకీయం అని ఈటల ధ్వజమెత్తారు.  ఆయన ఫోన్‌కు టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం వెళ్లడంపై పోలీసులు నోటీసులు ఇవ్వడంతో సోమవారం ఈటల వరంగల్ డీసీపీ ఎదుట హాజరయ్యారు.
ప్రశాంత్ తో ఈటల రాజేందర్ కు ఉన్న సంబంధాన్ని పొలిసులు అడిగి తెలుసుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్ ని కూడా పరిశీలించారు. దీంతో ఈటల విచారణ ముగిసింది. విచారణ ముగించుకుని బయటకు వచ్చిన ఈటల పోలీసులు తన సెల్ ఫోన్ తీసుకొని తన సమక్షంలోనే పరిశీలించారని పేర్కొన్నారు. తాను బాధ్యత గల ప్రజాప్రతినిధినని, అందుకే విచారణకు వచ్చానని వెల్లడించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘నా నియోజకవర్గం నుంచి ఓ కార్యకర్త మెసేజ్ పంపాడు. కానీ నేను ఆ మెసేజ్ ఒపెన్ కూడా చేయలేదు. నేను బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిని. నాకు ప్రశాంత్ నుండి ఎలాంటి మెసేజ్, ఫోన్ రాలేదు. సెల్‌ఫోన్‌తో సహా హాజరయ్యాను’’ అని తెలిపారు.  ప్రశాంత్ ఫోన్ చేశాడా? ప్రశాంత్‌తో పరిచయం ఉందా? అని అడిగారని, లేదని చెప్పానని వెల్లడించారు.