బిఆర్‌ఎస్‌ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్

కేసీఆర్ నాయకత్వంపై కొంతకాలంగా తిరుగుబాటు ధోరణిలో వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ, మాజీ మంత్రిలపై బిఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు, ఉమ్మడి మహబుబూనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
 
పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ వీరుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నియోజవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తన తరపున అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
 
ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉండగా పలు మార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. గత ముడేళ్లుగా బీఆర్ఎస్ అధినాయకత్వం తనను పట్టించుకోవటం లేదని, పార్టీలో తన సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆయన ఆరోపించారు.
 
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన పొంగులేటి ఆత్మీయ సమావేశానికి జూపల్లి తన అనుచరులతో కలిసి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇద్దరు నాయకులు ముఖ‌్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ వ్యతిరేక శక్తులన్ని ఏకం అవుతాయని ప్రకటించడంతో వేటు వేసిన్నట్లు తెలుస్తున్నది.
 
తెలంగాణలో మాటలు చెప్పి మభ్యపెట్టి మూడోసారి మఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. రోజులు ఎప్పుడు కేసీఆర్‌కు అనుకూలంగా ఉండవని, ప్రతి ఒక్కరు ఏకమవుతారని, దానికి బీజం పడిందని హెచ్చరించారు. మూడో సారి అధికారంలోకి రావాలనే తపనతో కేసీఆర్‌ చేస్తున్నారని వాటిని అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. 
 
సింగరేణి కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కూతురిని కాపాడుకునేందుకు రూ.కోట్లు వెదజల్లుతున్న సీఎంకు రిజర్వేషన్లపై పోరాడలేరా? అని ప్రశ్నించారు. కేటీపీఎస్‌ ఉద్యోగులకు నాలుగేళ్లుగా పీఆర్‌సీ వర్తింపచేయడం లేదని మండిపడ్డారు. 
 
ఇక మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ అసంపూర్తి పథకాలు, నెరవేరని హామీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. తిండి లేకపోయినా ఫర్వాలేదని, కానీ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోందన్న జూపల్లి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
 
ఇన్ని రోజులకు తనకు బిఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని పొంగులేటి సంతోషం ప్రకటించారు. బిఆర్ఎస్ నుంచి తనను ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషకరమని అంటూ దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.