రాహుల్ కు అవాంఛనీయ వ్యాపారవేత్తలతో సంబంధాలు

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో తనకు సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి గులామ్ నబీ ఆజాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి అవాంఛనీయ వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
 
రాహుల్ సహా మొత్తం గాంధీ కుటుంబానికి వ్యాపారవేత్తలతో అనుబంధం ఉందని ఆయన దుయ్యబట్టారు. ‘అతని (రాహుల్)తో సహా మొత్తం కుటుంబానికి వ్యాపారవేత్తలతో అనుబంధం ఉంది.. దేశం వెలుపల అవాంఛనీయ వ్యాపారవేత్తలను కలవడానికి ఎక్కడికి వెళ్తాడో నేను 10 ఉదాహరణలు చెప్పగలను’ అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాలు అనుబంధానికి ముగింపు పలుకుతూ గతేడాది ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్ సొంతంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రూ.20 వేల కోట్లు దోచుకున్నారని అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక సంచలన ఆరోపణలు చేసింది.

 
ఈ వివాదంలోకి తనను లాగే ప్రయత్నం చేస్తోన్న బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలపై రాహుల్ మండిపడ్డారు. ఈ సమయంలో ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు  భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏదీ లేదని, కొంతమంది వ్యక్తులు మాత్రమే మిగిలి ఉన్నారని ఆజాద్ స్పష్టం చేశారు. రాహుల్ సహా ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వానికి ఎలాంటి ప్రభావం లేదని పేర్కొన్నారు.
 
*భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ ప్రాబల్యం పెరిగిందని చాలా మంది అంటున్నారు. అతనికి ఎలాంటి ప్రాబల్యం లేదని నేను గ్రహించాను. రాహుల్‌ సూరత్‌ కోర్టుకు వెళ్లినప్పుడు గుజరాత్‌ నుంచి ఒక్క యువకుడు, రైతు కూడా రాహుల్‌తో కలిసి రాలేదు’ అని ఆజాద్ ఎద్దేవా చేశారు.

రాహుల్ నాయకత్వంపై యువతరం పది రెట్లు విసిగిపోయిందని, అందుకే ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ లాంటి వాళ్లు పార్టీ వీడుతున్నారని ఆయన విమర్శించారు. ‘అనిల్ పార్టీ వీడటం దురదృష్టకరం.. 50 ఏళ్లలోపు చాలా మంది యువత కాంగ్రెస్‌ను వీడుతున్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యం, వైఖరే కారణం’ అని ఆజాద్ ధ్వజమెత్తారు.