అమృత్‌పాల్‌ సింగ్ సన్నిహితుడు అరెస్ట్

గత మూడు వారాలుగా పంజాబ్ పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతూ, కేంద్ర, రాష్త్ర బలగాలు కలిసి జల్లెడ పడుతున్నా దొరకకుండా ముప్పతిప్పలు పెడుతూ తరచూ వీడియో సందేశాలను పంపుతున్న ఖలీస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు, అతడితో కలిసి పరారైన పపల్‌ప్రీత్ సింగ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు.
 
హోషియార్‌పూర్‌లో కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అతడ్ని అదుపులోకి తీసుకుంది. పంజాబ్, ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ చేపట్టి మాజీ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేశారు. జలంధర్ జిల్లాలో మార్చి 18న అమృత్‌పాల్‌ సింగ్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమృత్‌పాల్, పపల్‌ప్రీత్ సింగ్ పరారీలో ఉండగా చాలా చోట్ల ఇద్దరూ కలిసే తిరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే, హోషియార్‌పూర్‌లో మాత్రం ఎవరికి వాళ్లు వేర్వేరు దారుల్లో వెళ్లినట్టు తెలిపారు. వారి కోసం భారీ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు పపల్ ప్రీత్‌ను అరెస్ట్ చేశారు.  అమృత్‌ పాల్‌కి కుడి భుజం అయిన పపల్ ప్రీత్‌ అరెస్ట్‌తో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. పపల్‌ ప్రీత్ సింగ్ తన కుటుంబంతో కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది.

‘అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని తిరుగుతూ బాగా అలిసిపోయాడు.. అందుకే తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తరవాతే పోలీసులకు వీడియో పంపాడు. పోలీసులు పట్టుకోలేకపోతే తనంతట తానుగా లొంగిపోతాడు’ అని పపల్ తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం.  అయితే, అమృత్ ఎక్కడున్నదీ ఇంకా ఆచూకీ తెలియరాలేదు.  ఏప్రిల్ 14వ తేదీన బైసాకి  సంద‌ర్భంగా సిక్కు స‌మ్మేళ‌నం కోసం అమృత్‌పాల్ సింగ్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో పోలీసుల‌కు అప్పటి వరకు సెల‌వులను ర‌ద్దు చేశారు.