రాహుల్ రాజకీయ కెరీర్‌ కోసమే ఆదానీ అంశం

రాహుల్ గాంధీ రాజకీయ కెరీర్‌ను మెరుగుపరచేందుకే ఉద్దేశపూర్వకంగా అదానీ అంశాన్ని కాంగ్రెస్ నేతలు  లేవనెత్తుతున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ  వెయ్యాలంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. 

రాజకీయంగా రాహుల్ విఫలమయ్యారని స్పష్టం చేస్తూ న్యాయవ్యవస్థను బలహీనపరచేందుకు కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు రిజిజు సమాధానమిస్తూ హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని స్పష్టం చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసిందని, దానిపై కమిటీ దృష్టి సారించిందని ఆయన గుర్తు చేశారు. “అయితే ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. వీళ్లు (కాంగ్రెస్) కేవలం రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్‌ను మెరుగుపరచేందుకే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని చెప్పదలచుకున్నాను” అని జమ్మూ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

రాహుల్ గాంధీపై 2019 పరువునష్టం కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి నాలుక కత్తిరిస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ, కాంగ్రెస్ నైరాశ్యంలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి జరుపుతోందని విమర్శించారు.  అయితే ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. న్యాయవ్యవస్థను బెదిరించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కేంద్ర  మంత్రి ధ్వజమెత్తారు. 1975లో ఎమర్జెన్సీకి ముందు కూడా ఆ పార్టీ నాయకులు న్యాయవ్యవస్థపై దాడి చేశారని ఆయన గుర్తు చేశారు.  ఆ పార్టీ నైరాశ్యంలో ఉన్నందున మరిన్ని దాడులు కూడా చేయవచ్చని రిజిజు చెప్పారు.

కిరణ్ రిజిజు కారుకు ప్రమాదం

 ఇలాఉండగా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు శనివారంనాడు రోడ్డు మార్గంలో వెళ్తుండగా రాంబాన్ జిల్లాలో ఆయన కారుకు స్పల్ప ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు.
అనంతరం కిరణ్ రిజిజు యధాప్రకారం కారులో తాను హాజరుకావలసిన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. రద్దీ కారణంగా రోడ్ జామ్ అయిందని, ఆ సమయంలో పూర్తి లోడ్‌తో ఉన్న ఒక వాహనం వెనక్కి జారి కిరణ్ రిజిజు కారును ఢీకొందని తెలుస్తోంది. అయితే, రిజిజు క్షేమంగా బయటపడ్డారు