పంజాబ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట విధులు

వేసవి వచ్చిందంటే మాములుగా పాఠశాల విద్యార్థులుకు ఒంటిపూట బడులు పెడతారు. కానీ పంజాబ్ లో  ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట విధులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వేసవి తాపం నుంచి ఉద్యోగులు ఉపశమనం పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఈ మేరకు నిపుణులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. అయితే, వాస్తవానికి విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున విద్యుత్ ఆదాకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కనై,  ఎండల నుంచి ఉద్యోగులకు, పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు మార్చాలని నిర్ణయించిన్నట్లు చెబుతున్నారు.
 
పిల్లలకు ఒంటి పూట బడుల తరహాలోనే ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మన్ తెలియచేశారు . ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నాయి. మే 2 నుంచి నూతన పని వేళల ప్రకారం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది.
 
వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు, అంటే జులై 15 వరకు ఈ టైమింగ్స్‌నే ఉద్యోగులు పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు సహా ఎంతో మందిని సంప్రదించి, వారితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం ప్రకటించారు.  వేసవిలో విద్యుత్తు భారం తగ్గించడానికే ఈ నిర్ణయమని, ఉద్యోగులు, నేతలను దీనిపై సంప్రదించామని పేర్కొన్నారు. విద్యుత్తు లోడ్‌ 300 నుంచి 350 మెగావాట్ల వరకు తగ్గుతుందని ఆయన చెప్పారు. తాను కూడా ఇక నుంచి ఉదయం 7.30 గంటలకే కార్యాలయానికి వస్తానని సీఎం భగవంత్‌ మాన్‌ తెలిపారు.